Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో 8మందికి చోటు
కొలంబో : మరో 8మంది మంత్రులను తీసుకోవడం ద్వారా శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సా సోమవారం ఆ దేశ మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇంతమందిని తీసుకున్నా ఆర్థిక మంత్రిని మాత్రం నియమించలేదు. గతంలో ఎన్నడూ లేని రీతిలో శ్రీలంక అనూహ్యమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నియామకం అవసరం కాగా, ఇప్పటికి రెండుసార్లు ఆర్థిక మంత్రి ప్రస్తావన లేకుండానే మంత్రి వర్గాన్ని విస్తరిస్తూ వస్తున్నారు. పాలక శ్రీలంక పొదుజన పెరమునా (ఎస్‌ఎల్‌పిపి), దాని మిత్రపక్షాలైన ఎస్‌ఎల్‌ఎఫ్‌పి, ఇపిడిపిలకు చెందినవారే కొత్త మంత్రులుగా నియమితులయ్యారు. అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండు చేస్తూ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సమయంలో రాజపక్సా ఇప్పటికి ఐదుసార్లు మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. తన సోదరుడు, ప్రధాని మహిందా రాజపక్సాతో బలవంతంగా రాజీనామా చేయించారు. ఆర్థిక సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనే లక్ష్యంతో ఏర్పడిన రణిల్ విక్రమసింఘె ప్రభుత్వంలో కొత్త మంత్రులు పనిచేయనున్నారు. గత శుక్రవారం 9మంది మంత్రులను నియమించారు. వీరిలో ప్రతిపక్షాలకు చెందినవారు కూడా వున్నారు. ఏప్రిల్‌లో సోదరుడు బసిల్ రాజపక్సాను తొలగించినప్పటి నుండి ఆర్థిక మంత్రి స్థానం ఖాళీగానే కొనసాగుతోంది. ఆయన స్థానంలో తొలుత అలీ సబ్రేని ఆర్థిక మంత్రిగా గొటబయా నియమించినా, 24గంటల వ్యవధిలోనే అలీ రాజీనామా అందజేశారు. ఆ తర్వాత ఆ పదవికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ పదవిని చేపట్టారు. ఐఎంఎఫ్‌తో చర్చలు జరిపారు. అయితే కేబినెట్‌ను రద్దు చేయడంతో ఆయన పదవి ఖాళీ అయింది. మే 3న కొత్తగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినా అందులో ఆర్థిక మంత్రి లేరు.