Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, అమెరికా సహా 11దేశాల సంతకాలు
టోక్యో : కొత్త వాణిజ్య ఒప్పందంలో 12 దేశాలు చేరాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. సరఫరా మార్గాలు, డిజిటల్ వాణిజ్యం, పరిశుద్ధ ఇంధనం, అవినీతి వ్యతిరేక ప్రయత్నాలు వంటి అంశాలపై ఆసియా ఆర్థిక వ్యవస్థలతో మరింత సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు అమెరికాకు ఈ ఒప్పందం దోహదపడుతుందని వైట్‌హౌస్ పేర్కొంది. ఇండో-పసిఫిక్ ఆర్థిక చట్రపరిధి ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల్లో ఆస్ట్రేలియా, బ్రూనె, భారత్, ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, మలేసియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం దేశాలు ఉన్నాయి. అమెరికాతో కలిపి ఈ దేశాలు మొత్తంగా ప్రపంచంలో 40శాతం జిడిపికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. భవిష్యత్తు కోసం తమ ఆర్థిక వ్యవస్థలను సన్నద్ధం చేసుకోవడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆ దేశాలు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వంటి కారణాలతో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటి నుండి కోలుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. ఈ ఒప్పందంలో కొన్ని లొసుగులు వున్నాయని విమర్శకులు పేర్కొంటున్నారు. టారిఫ్‌లను తగ్గించడం ద్వారా లేదా సంతకాలు చేసిన దేశాలకు అమెరికా మార్కెట్లో మరింత అవకాశాలు కల్పించడం ద్వారా భాగస్వామ్య దేశాలకు ఎలాంటి రాయితీలను ఈ ఒప్పందం కల్పించడం లేదని పేర్కొన్నారు. ఇటువంటి పరిమితుల వల్ల ఈ ఒప్పందం, ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్షిప్ (ఫసిఫిక్ దేశాల భాగస్వామ్య ఒప్పందం) కు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా మారకపోవచ్చునని వారు పేర్కొంటున్నారు.