Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జపాన్ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోడీ ఆహ్వానం
- భారత్ పరివర్తనా క్రమంలో జపాన్ అవిభాగజ్య భాగస్వామి అని వ్యాఖ్య
టోక్యో : భారత దేశ సంస్కరణలు, అక్కడ కొత్తగా తలెత్తుతున్న వ్యాపార, వాణిజ్య అవకాశాలపై ప్రధాని మోడీ జపాన్ పారిశ్రామికవేత్తలతో చర్చించారు. ప్రస్తుతం జపాన్ రాజధాని టోక్యోలో పర్యటిస్తున్న మోడీ అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. మోడీ కలిసిన వారిలో జపాన్ సాంకేతిక రంగానికి చెందిన బహుళ జాతి సంస్థ, దుస్తుల రంగంలో అగ్రగామి సంస్థల అధిపతులు వున్నారు. జపాన్ ఎన్ఇసి కార్పొరేషన్ అధినేత నొబుహిరో ఎండో, జపాన్ బ్రాండ్ యునిక్విలో సిఇఓ తదాషి యనారులతో మోడీ భేటీ అయ్యారు. భారతదేశంలో అమలవుతున్న సంస్కరణల పంథాను మోడీ వారితో ప్రముఖంగా ప్రస్తావించారు.
భారత్ పరివర్తనా క్రమంలో జపాన్ను 'అవిభాజ్యమైన భాగస్వామి'గా చూస్తున్నట్లు ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. భారతదేశంలో సులభంగా వ్యాపారం చేసుకునేందుకు అవసరమైన పద్దతులు, విధి విధానాలతో పాటుగా, ఆకర్షణీయమైన రాయితీలు, సాహసోపేతమైన సంస్కరణలు, బృహత్తరమైన పథకాలు, ఇవన్నీ కలిసి జపాన్ వ్యాపారాలకు అపారమైన అవకాశాలు సృష్టించాయని ఈ సందర్భంగా మోడీ పేర్కొన్నారు. జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా ఆహ్వానం మేరకు క్వాడ్ నేతల సదస్సుకు హాజరయేందుకు మోడీ టోక్యో వెళ్లారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న క్రియాశీల సంబంధాలను ఆయన ప్రస్తావించారు. మంగళవారం కిషిదాతో మోడీ భేటీ కానున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తయారీ రంగం, సేవలు, వ్యవసాయం, డిజిటల్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాల రంగాల్లో బలమైన పునాది నిర్మించడానికి సాగిన ప్రయాణాన్ని మోడీ వివరించారు.
డిజిటల్ లెర్నింగ్, ఫిన్టెక్ కంపెనీలు, మౌలిక సదుపాయాలు, వసతుల రంగానికి సంబంధించిన అవకాశాల గురించి ఆయన మాట్లాడినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. భారతదేశంలోని టెలికమ్యూనికేషన్ రంగంలో ఎన్ఇసి పాత్రను మోడీ ప్రశంసించారు. ముఖ్యంగా చెన్నై-అండమాన్ నికొబార్ దీవుల్లో, కోచి-లక్షదీవుల్లో చేపట్టిన ఒఎఫ్సి ప్రాజెక్టులను అభినందించారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకం కింద పెట్టుబడులకు గల అవకాశాల గురించి కూడా ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ''పారిశ్రామికాభివృద్ధి, పన్నుల విధింపు, కార్మికులతో సహా భారత్లో సులభంగా వ్యాపారం చేయడానికి వీలు కల్పించే పలు సంస్కరణలను ఇరు పక్షాలు చర్చించాయి.'' అని ఆ ప్రకటన పేర్కొంది. కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారత్లో నెలకొన్న అవకాశాలను కూడా వారు చర్చించారని తెలిపింది. అలాగే స్మార్ట్ నగరాలు వంటి రంగాల్లో గల అవకాశాలపై ఎండో మాట్లాడారు. భారత్లో జపాన్ భాషను నేర్చుకోవడాన్ని ప్రోత్సహించేందుకు వినూత్నంగా చేపట్టే కృషిని కూడా చర్చించారు. జౌళి ఉత్పత్తి రంగంలో రిటైలర్ యునిక్విలోతో మోడీ సమావేశంపై కూడా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. భారత్లో జౌళి రంగాన్ని అభివృద్ధిపరచాలన్నది వారి ప్రయత్నంగా వుందని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చి ట్వీట్ చేశారు. భారతదేశ ప్రజల పారిశ్రామికాభివృద్ధి కాంక్షను ప్రత్యేకంగా యునిక్విలో సిఇఓ ప్రశంసించారు. జౌళి రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పిఎం-మిత్ర పథకంలో పాలు పంచుకోవాల్సిందిగా మోడీ ఆయననను కోరారని పిఎంఓ ఇండియా ట్వీట్ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) నమూనాలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా జౌళి పార్కులను అభివృద్ధిపరచడం పిఎం-మిత్ర పథకం లక్ష్యంగా వుంది. ప్రతి జౌళి పార్కులో ఇంక్యుబేషన్ సెంటర్, కామన్ ప్రాసెసింగ్ హౌస్, కామన్ ఎఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇతర సంబంధిత సదుపాయాలు వుంటాయి.