Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెక్సాస్ పాఠశాలలో విచక్షణరహితంగా యువకుడి కాల్పులు
- 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు కాల్చివేత..
- జో బైడెన్ దిగ్భ్రాంతి
వాషింగ్టన్ : అమెరికా మరోసారి నెత్తురోడింది. కాల్పుల మోతతో కలకలం రేగింది. సౌత్ టెక్సాస్‌లోని ఓ స్కూల్లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 18 మంది పిల్లలు సహా మొత్తం 21 మందిని చంపేశాడు. మతుల్లో టీచర్ కూడా ఉన్నారు. ప్రైమరీ స్కూల్లోకి చొరబడిన 18 ఏండ్ల యువకుడు తన వెంట తెచ్చుకున్న గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో చనిపోయిన విద్యార్థులంతా 4 ఏళ్ల నుంచి 14 ఏళ్ల మధ్యలోపువారు కావటం గమనార్హం. పోలీసుల కథనం మేరకు.... సల్వడార్ రామోస్ (18) అనే యువకుడు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లోకి ప్రవేశించాడు. తనవెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. దీంతో 21 మంది అక్కడికక్కడే చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ స్కూల్‌ను చుట్టుముట్టారు. వారు జరిపిన కాల్పుల్లో గన్‌మ్యాన్ కూడా చనిపోయాడు. స్కూల్లోకి ఒంటరిగా చొరబడిన యువకుడు స్కూల్ కు వచ్చే ముందు.. తన తల్లిని హతమార్చాడు. కాల్పులు జరిగిన స్కూల్లో మొత్తం ఐదు వందల మంది కంటే ఎక్కువగానే స్టూడెంట్స్ ఉన్నారు. గన్ ఫైర్ తర్వాత పాఠశాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
టెక్సాస్ చరిత్రలో అత్యంత దారుణ ఘటన : టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్
టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ మాట్లాడుతూ ... యువకుడి కాల్పుల్లో 18 మంది చిన్నారులు, ముగ్గురు పెద్దవారు చనిపోయినట్టు ధ్రువీకరించారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో ఆ యువకుడు కూడా చనిపోయాడని వెల్లడించారు. గత పదేండ్లలో అమెరికాలోని స్కూళ్లలో జరిగిన కాల్పుల ఘటనల్లో అతిపెద్దది ఇదేనని అభిప్రాయపడ్డారు. టెక్సాస్ చరిత్రలో.. ఇది అత్యంత దారుణ కాల్పుల ఘటన అని పేర్కొన్నారు.
28 సాయంత్రం వరకు జాతీయ జెండాను అవనతం చేయాలి : బైడెన్ ఆదేశం
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని ప్రభుత్వ భవనాలు, మిలటరీ స్థావరాలు, నావల్ స్టేషన్స్, అమెరికా రాయబార కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఈ నెల 28 సాయంత్రం వరకు అవనతం చేయాలని ఆదేశించారు.