Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ నది వద్ద కూలిపోయింది..!
- నలుగురు భారతీయులు సహా మొత్తం 22మంది మృతి!
న్యూడిల్లీ : నలుగురు భారతీయులు సహా మొత్తం 22మందితో ప్రయాణిస్తున్న నేపాల్ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం ఆదివారం ఉదయం 9.55 గంటలకు పర్యాటక నగరమైన పోఖారాలో టేకాఫ్ తీసుకుంది. 15 నిమిషాల తర్వాత ఈ విమానం గ్రౌండ్ కంట్రోల్‌తో సంబం ధాలు కోల్పోయింది. దాంతో ఈ విమానం కోసం తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టారు. రెండు ఇంజిన్లు కలిగిన ఈ చిన్న విమానం మిస్పయిన వెంటనే సెర్చ్ ఆపరేషన్ కోసం రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. చివరికి కోవాంగ్ గ్రామం సమీపంలో లామ్చే నది వద్ద కూలిపోయినట్టు గుర్తించారు. విమాన ప్రమాదంపై సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ సంఘటన స్థలానికి బయల్దేరింది. ఈ విమానంలో 19మంది ప్రయా ణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం, మనపతి హిమాల్ కొండచరియల కింద లాంచే నది ఒడ్డున విమానం కూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే నేపాల్ ఆర్మీ రోడ్డు, వాయు మార్గాల్లో ఘటనా స్థలానికి బయల్దేరినట్టు ఆర్మీ అధికార ప్రతినిధి నారాయణ్ సిల్వాల్ తెలిపారు.
విమానంలో ముంబయికి చెందిన అశోక్ కుమార్ త్రిపాఠి, ధనుష్ త్రిపాఠి, రితికా త్రిపాఠి, వైభవి త్రిపాఠిలతోపాటు ఇద్దరు జర్మన్లు, 13మంది నేపాలి ప్రయాణికులు ఉన్నారు. ఘటనపై వీరి కుటుంబాలకు సమాచారం అందించినట్టు నేపాల్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు. ఉదయం 9.55 గంటలకు టేకాఫ్ అయిన విమానం, 10.15 గంటలు జోమ్సోమ్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. విమాన శకలాలను గుర్తించినప్పటికీ అందులోని ప్రయాణికుల సంగతేంటన్నది తెలయాల్సి ఉంది.