Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొలి రౌండ్ కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో
- అగ్రగామిగా నిలిచిన పెట్రో
- రెండో స్థానాన్ని లిబరల్స్‌కు కోల్పోయిన అధికార పార్టీ
- జూన్ 19న రెండో రౌండ్ ఎన్నికలు
బొగోటా : మొదటి రౌండ్ కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థి గుస్తావ్ పెట్రో 40 శాతానికిపైగా ఓట్లతో అగ్రగామిగా నిలిచారు. అధికార కూటమికి చెందిన అభ్యర్థి ఫెడరికో గుటెరజ్ను అధ్యక్ష ఎన్నికల బరినుండి కొలంబియా ప్రజలు తన్ని తగలేశారు. పాలక సంకీర్ణ భాగస్వామ్య పార్టీలన్నీ బలపరిచినా గుటెరజ్కు 24 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయన మూడవ స్థానంలోకి నెట్టబడ్డారు. వట్టి వాగుడుకాయ, మధ్యేవాద మితవాద పార్టీ అయిన 'లీగ్ ఆఫ్ యాంటీ కరప్షన్ రూలర్స్' అభ్యర్థి రొడాల్ఫొ హెర్నాండెజ్ ఊహించని విధంగా 28 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. మిగతావారిలో సెర్గీ ఫజార్డేకు 4.2 శాతం, జాన్ మిల్టన్‌కు 1.29 శాతం, ఎన్రిక్ గోమెజ్‌కు 0.23 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కొలంబియా ఎన్నికల నిబంధనల ప్రకారం విజయానికి అవసరమైన 50శాతానికిపైగా ఓట్లు మొదటి రౌండ్లో ఏ అభ్యర్థికి రానిపక్షంలో రెండో రౌండ్ ఎన్నికలు తప్పనిసరి. తొలి రౌండ్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు మాత్రమే రెండో రౌండ్ పోటీకి అర్హులు. మిగవావారంతా ఎలిమినేట్ అవుతారు. ఆ విధంగా జూన్19న జరిగే రెండో రౌండ్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్షాల (కొయిలేషన్ పాక్టో హిస్టారికో) అభ్యర్ధి గుస్తావో పెట్రోతో హెర్నాండెజ్ ముఖాముఖి తలపడనున్నారు.
మొదటి రౌండ్లో విజయంపై పెట్రో సంతోషం వ్యక్తం చేస్తూ, రెండో రౌండ్ ఎన్నికల్లోనూ కొలంబియా ప్రజలు మార్పుకే పట్టం కడతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రెండో దశలో తన ప్రత్యర్ధి అయిన తనపై అవినీతి ఆరోపణలు చేయడం విచారకరమని వ్యాఖ్యానించారు. తన ఎన్నికల ప్రచారంలో మహిళల పాత్ర గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.