Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాడ్రిడ్ : కతార్ మాజీ యువరాణి కాసియా గాలానియో (46) స్పెయిన్‌లోని తన ఇంట్లో చనిపోయి పడివుండగా, పోలీసులు కనుగొన్నట్టు పోలీసులు బుధవారం తెలిపారు. దక్షిణ స్పెయిన్‌లోని మార్బెల్లాలో తన అపార్ట్మెంట్లో ఆదివారం ఉదయం చనిపోయి వుండగా కనుగొన్నట్టు పోలీసు ప్రతినిధి చెప్పారు. ఫ్రాన్స్‌లో వున్న ఆమె కుమార్తెల్లో ఒకరి నుండి ఫోన్ వచ్చిన తర్వాత పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి చూడగా విషయం బయటపడింది. తాము ఫోన్ చేస్తున్నా ఎవరూ స్పందించడం లేదని ఆమె కుమార్తె ఫిర్యాదు చేశారని చెప్పారు. అపార్ట్మెంట్ కాపలాదారు సాయంతో పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె మంచంపై చనిపోయి వుందని, ఎక్కడా ఎలాంటి హింస జరిగినట్లు ఆనవాళ్ళు కూడా లేవని తెలిపారు. అమెరికా జాతీయురాలైన గాలానియో మృతదేహానికి పోస్టు మార్టం జరగాల్సి వుంది. కతార్ చక్రవర్తికి మామ అయిన అబ్దుల్ అజీజ్ బిన్ ఖలీఫా అల్ తానిని ఆమె వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. తర్వాత తన భర్తతో విడిపోయిన ఆమె పిల్లల కస్టడీ కోసం కూడా సుదీర్ఘ పోరాటమే చేశారు. ప్రస్తుతం పారిస్‌లో తమ తండ్రితో కలిసే పిల్లలు జీవిస్తున్నారు.