Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాది పొడుగునా మైనార్టీలపై దాడులు
- అమెరికా ప్రభుత్వ నివేదిక
- ఖండించిన భారత్
వాషింగ్టన్, న్యూఢిల్లీ : భారత్లో మతస్వేచ్ఛకు తీవ్ర ముప్పు ఏర్పడిందనీ, దేశంలో మైనార్టీలపై గత ఏడాది పొడుగునా హత్యలు, దాడులు, బెదిరింపులు కొనసాగాయని అమెరికా ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2021 నివేదికను కాంగ్రెస్లో గురువారం అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ నివేదిక సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్ మాట్లాడుతూ 'ప్రార్థనా స్థలాలపై పెరుగుతున్న దాడుల కారణంగా మైనార్టీలు ముప్పులో ఉన్నారు' అని తెలిపారు. 2021లో భారత్లో ఏడాది పొడుగునా వివిధ ప్రదేశాల్లో మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. '2021లో భారత్లో సంవత్సరం పొడవునా హత్యలు, దాడులు, బెదిరింపులతోసహా మతపరమైన మైనారిటీ వర్గాలకు చెందిన వారిపై దాడులు జరిగాయి. గోహత్య, గొడ్డు మాంసం వ్యాపారం ఆరోపణల ఆధారంగా హిందువులు కాని వారిపై గోరక్షకులుగా పేర్కొంటూ దాడులకు పాల్పడ్డారు.' అని ఆ నివేదిక పేర్కొంది. మెరాకో, తైవాన్, ఇరాక్, తిమోర్ లెస్టే వంటి దేశాల్లో మత స్వేచ్ఛ విషయంలో మెరుగుదల కనిపిస్తుండగా, భారత్, వియత్నాం, నైజీరియా వంటి దేశాల్లో మత స్వేచ్ఛ తీవ్ర ఒత్తిడిలో ఉందని తెలిపారు. బ్లింకెన్ తరువాత ఈ కార్యక్రమంలో మాట్లాడిన అంతర్జాతీయ మత స్వేచ్ఛకు అమెరికా రాయబారిగా ఉన్న రషద్ హుస్సేన్ కూడా తన ప్రసంగంలో భారత్ పేరును ప్రస్తావించారు. మతస్వేచ్ఛపై బెదిరింపులను భారత్లో అధికారులు పట్టించుకోవడం లేదని, లేదా బెదిరింపులకు పాల్పడేవారికి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. అమెరికా ప్రభుత్వ నివేదికను ఇండియన్ అమెరికన్ ముస్లిం కాంగ్రెస్కు చెందిన న్యాయవాద డైరెక్టర్ అజిత్ సాహి స్వాగతించారు. 'నివేదికలో భారత్ పేరును ప్రస్తావించినందుకు స్వాగతిస్తున్నాం. అక్కడ ఉల్లంఘనలు ఆమోదయోగ్యంగా లేవు. భారత్లో ముస్లింలు, క్రైస్తవులపై పెరుగుతున్న మతపరమైన హింసను మరింతమంది అమెరికా కాంగ్రెస్ సభ్యులు, అమెరికా ప్రభుత్వ అధికారులు ఖండిస్తారని ఆశిస్తున్నాం అని తెలిపారు.
ఓటు బ్యాంక్ నివేదిక : భారత్
దేశంలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయనే అమెరిక ప్రభుత్వ నివేదికను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. అమెరికా సీనియర్ అధికారుల 'అవగాహన లేని వ్యాఖ్యలు' అని, అంతర్జాతీయ సంబంధాల్లో 'ఓటు బ్యాంక్ రాజకీయాలు' అని భారత ప్రభుత్వం విమర్శించింది. 'ప్రేరేపిత ఇన్పుట్లు, పక్షపాత అభిప్రాయాలు' ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. భారత్ సహజంగానే బహుళ సమాజమని, మత స్వేచ్ఛ, మానవ హక్కులకు విలువనిస్తుందని చెప్పారు. అమెరికాతో చర్చల్లో అక్కడ జాతిపరంగా జరిగే దాడులు, విద్వేషపూరిత నేరాలు, తుపాకీ సంస్కృతి వంటి అంశాలపై తరుచుగా ఆందోళన వ్యక్తం చేస్తుంటామని తెలిపారు.