Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 43 మంది మృతి, 450 మందికిగా పైగా గాయాలు
ఢాకా : బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిట్టగాంగ్ ప్రాంతంలోని ఒక షిప్పింగ్ కంటైనర్ డిపోలో శనివారం రాత్రి సంభవించిన భారీ రసాయన పేలుడులో 43 మంది సజీవ దహనమయ్యారు. 450 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.
చిట్టగాంగ్‌లోని సీతాకుండ ఉపజిల్లా కడంరసూల్ ప్రాంతంలోని బిఎం కంటైనర్ డిపోలో శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. రాత్రి 11:45 గంటల ప్రాంతంలో రసాయనాలు ఉన్న ఒక కంటైనర్‌లో పేలుడు జరిగి, ఒక కంటైనర్ నుంచి మరొక కంటైనర్‌కు మంటలు వ్యాపించాయి. రసాయనాలుకలిగి ఉన్న అనేక కంటైనర్లు పేలినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేస్తూ ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 40 మంది అగ్నిమాపక సిబ్బంది, 10 మంది పోలీసులు గాయపడినట్లు చిట్టగాంగ్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో 450 మందికిపైగా గాయపడగా, వీరిలో సుమారు 350 మంది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చట్టగ్రామ్ మెడికల్ కాలేజి ఆసుపత్రి (సిఎంసిఎహెచ్)లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో అనేక మందికి 60 నుంచి 90 శాతం వరకు కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. డిపోలో ఉన్న రసాయనాల కారణంగానే పేలుడు సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. పేలుడు శబ్దాలు కొన్ని కిలోమీటర్ల వరకూ వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. శిథిలాలు అరకిలోమీటరు దూరంలోని ఇళ్లపై కూడా పడ్డాయంటే పేలుడు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
రంగంలోకి సైన్యం..
పేలుడు జరిగిన కొన్ని గంటల తర్వాత కూడా మంటలు అదుపులోకి రావడం లేదు. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. మంటలను నిరోధించడంతో పాటు, ప్రమాదకర రసాయనాలు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. సహాయక చర్యలో 19 అగ్నిమాపక వాహనాలు పాల్గొంటుండగా, ఆరు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. చటోగ్రామ్ డివిజనల్ కమిషనర్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 50 వేల టాకాలు, గాయపడిన వారి కుటుంబాలకు 20 వేల టాకాలు పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి షేక్ హసీనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు, ఇతర సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై మూడు రోజుల్లో నివేదిక ఇచ్చే విధంగా ఉన్నతస్థాయి విచారణ కమిటీని అధికారులు ఏర్పాటు చేశారు. బిఎం కంటైనర్ డిపో 2011 మే నుంచి ఇన్లాండ్ కంటైనర్ డిపో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ ప్రైవేట్ డిపోను 21 ఎకరాల్లో బంగాళాఖాతానికి సమీపంలో నిర్మించారు.