Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాలతో సహకరించడానికి సిద్ధంగా వున్నట్లు చైనా ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి సోమవారం మాట్లాడుతూ, అంతర్జాతీయంగా చైనాకు పెరుగుతున్న అవకాశాలను గుర్తించాల్సిందిగా ఆ దేశాలను కోరారు. పసిఫిక్ ద్వీప దేశాలతో (పీఐసీ) సహకారంలో భాగస్వాములు కావాల్సిందిగా ఆ రెండు దేశాలను కోరారు. పసిఫిక్ ద్వీప దేశాలకు సంబంధించి త్రైపాక్షిక, చతుర్భుజ ప్రాజెక్టులను చేపట్టేందుకు సుముఖంగా వున్నామని చెప్పారు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాల్సిందిగా న్యూజీలాండ్‌ను వాంగ్ యి కోరారు. ఏ పలుకుబడి కోసం ఎవరితోనూ పోటీ పడే ఉద్దేశం చైనాకు లేదని సోషల్‌మీడియా ఇంటర్వ్యూలో వాంగ్ వ్యాఖ్యానించారు. భౌగోళిక, రాజకీయ పోటీ పట్ల కూడా తమకు ఆసక్తి లేదన్నారు. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్లతో పసిఫిక్ దేశాలకు గల సాంప్రదాయ సంబంధాలను చైనా ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు. దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్లతో మరింత సహకారాన్ని కొనసాగించేందుకు ఎలాంటి అరమరికలు లేని వైఖరిని చైనా అనుసరిస్తుందని చెప్పారు. మే 26 నుంచి జూన్ 4 వరకు ఎనిమిది దక్షిణ పసిఫిక్ దేశాల్లో వాంగ్ పర్యటన జరిపిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. పసిఫిక్ ద్వీప దేశాలతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవడానికి చైనా ప్రభుత్వం కట్టుబడి వుందన్న సంకేతాలు వెళ్ళాయి.