Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీస్‌కు టర్కీ హెచ్చరిక
అంకారా: ఏజియన్ సముద్రం లోని దీవులను నిస్సైనికీకరించాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తైయీప్ ఎర్డోగన్ గ్రీస్‌ను హెచ్చరించారు. ఏజియన్ దీవులను నిరాయుధంగా వుంచేందుకు హామీ కల్పిస్తున్న ఒప్పందాలను ఉల్లంఘించి అక్కడ సైనిక ఉనికిని చాటేలా గ్రీస్ చర్యలు తీసుకుంటోందని టర్కీ విమర్శిస్తోంది. వాటిని నిస్సైనికంగానే కొనసాగిస్తా మన్న షరతుపై గ్రీస్‌కు ఆ దీవులను వదిలామని ఎర్డోగన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందిగా గ్రీస్‌కు ఎర్డోగన్ స్పష్టం చేశారు. ఏజియన్ తీర ప్రాంతంలోని ఇజ్మీర్ సమీపంలో జరిగిన సైనిక విన్యాసాల చివరి రోజున ఎర్డోగన్ మాట్లాడారు. తానేమీ జోక్ చేయడం లేదని, ఈ విషయాన్ని సీరియస్‌గానే చెబుతున్నా నని ఆయన వ్యాఖ్యానించారు. గ్రీస్, టర్కీలు నాటో మిత్రపక్షాలు. కానీ పలు అంశాలపై ఈ ఇరుగు పొరుగు దేశాలకు వివాదాల చరిత్ర వుంది. చివరకు చింతించే చర్యలకు, కలలకు దూరంగా వుండాలన్నదే తమ హెచ్చరిక అని ఎర్డోగన్ స్పష్టం చేశారు. ఏజియన్పై తమ హక్కులను టర్కీ వదులుకోబోదని పేర్కొన్నారు. ఇదిలావుండగా, ఒప్పందాలకు టర్కీ ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు భాష్యం చెబుతోందని గ్రీస్ విమర్శిస్తోంది. టర్కీ తీసుకునే ఘర్షణాయుత చర్యల నేపథ్యంలో తమని తాము కాపాడుకోవడానికి చట్ట బద్ధమైన ప్రాతిపదికలు వున్నాయని పేర్కొంది. టర్కీ రెచ్చగొట్టే చర్యలను ప్రశాంత చిత్తంతో, చిత్తుశుద్ధితో గ్రీస్ ఎదుర్కొంటోందని గ్రీక్ ప్రభుత్వ ప్రతినిధి గియాన్నిస్ ఒకినొము తెలిపారు.