Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూటీవో ఒప్పందంపై మోడీ సర్కార్ చర్చలు
- ధనిక దేశాల ఒత్తిడికి తలొగ్గే దిశగా భారత్ !
- కోట్లాదిమంది మత్స్య కార్మికుల జీవితాలపై ప్రభావం
ప్రపంచ వాణిజ్య మండలి (డబ్ల్యూటీవో)లో ధనిక దేశాల ఒత్తిడికి మోడీ సర్కార్ తలొగ్గే సూచనలు కనపడుతున్నాయి. మత్స్య కార్మికులకు ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు, ఇతర పథకాల అమలును వెంటనే నిలిపివేయాలని ధనిక దేశాలు భారత్, చైనా వంటి దేశాలపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. దీనికి సంబంధించి ఒప్పందంపై సభ్య దేశాల మధ్య ప్రస్తుతం జెనీవాలో చర్చలు సాగుతున్నాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ నేతృత్వంలో భారత అధికార బృందం చర్చల్లో పాల్గొన్నది. ధనిక దేశాలు తెరపైకి తీసుకొస్తున్న నిబంధనలకు మోడీ సర్కార్ ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం.
జెనీవా : మత్స్యకార్మికులకు ఆయా దేశాల్లో దక్కుతున్న ప్రభుత్వ సబ్సిడీలతో పోల్చితే భారత్‌లో అందుతున్నది చాలా స్వల్పం. డబ్ల్యూటీవో నిబంధనలకు తలొగ్గితే..ఈమాత్రం సబ్సిడీలు కూడా కార్మికులకు అందే పరిస్థితి ఉండదు. చైనాలో 7.3 బిలియన్ డాలర్లు (సుమారుగా రూ.57వేల కోట్లు), ఈయూ దేశాల్లో 3.8 బిలియన్ డాలర్లు (సుమారుగా రూ.30వేల కోట్లు), అమెరికాలో 3.4 బిలియన్ డాలర్లు (సుమారుగా రూ.26వేల కోట్లు) సబ్సిడీల రూపంలో మత్స్యకార్మికులకు అందుతోంది. వీటితో పోల్చితే భారత్‌లో వివిధ పథకాల ద్వారా సబ్సిడీ రూపంలో అందుతున్నది కేవలం రూ.2144కోట్ల రూపాయలు. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- 2016 గణాంకాల ప్రకారం, సముద్రతీరంలో మత్స్యకార్మికుల జనాభా 37.7లక్షలు ఇందులో 67.3శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ సబ్సిడీలను పూర్తిగా ఆపేస్తే.. మత్స్యకార్మికుల కుటుంబాలు మరింత పేదరికంలోకి కూరుకుపోతాయి.
మనదేశంలో 2019లో 44లక్షల టన్నుల చేపల్ని కార్మికులు పట్టుకోగా, సముద్రతీరం నుండి వచ్చిన ఉత్పత్తి 38లక్షల టన్నులుగా ఉంది. తీరప్రాంతాల్లో సాంప్రదాయ పద్ధతుల్లో చేపల వేట సాగించేవారే మనదేశంలో ఎక్కువగా ఉన్నారు. చిన్న చిన్న మర పడవల్లో, ఇతర పనిముట్లతో సముద్రంపైకి వెళ్లి చేపల వేట కొనసాగిస్తున్నారు. ఇదే వారి ప్రధాన జీవనోపాధిగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో చేపల వేట భారీ ఎత్తున సాగుతోంది. ఇదొక పరిశ్రమగా ఏర్పడ్డది. పెద్ద పెద్ద ఓడల్లో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆ దేశాల్లో ఉపయోగిస్తున్నారు. సముద్ర జలాల్లో ఇతర దేశాల ఆర్థిక జోన్లలోకి అభివృద్ధి చెందిన దేశాల ఓడలు చొరబడి చేపల వేటను కొనసాగిస్తున్నాయి. ఇది భారత్‌లాంటి సాంప్రదాయ చేపలవేట సాగించే మత్స్యకార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. డబ్ల్యూటీవో ఒప్పందంపై భారత్‌గనుక సంతకం చేస్తే..ముందు ముందు మత్స్యకార్మికుల పరిస్థితి మరింత ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.
రోడ్డున పడతారు..
మనదేశంలోని మత్స్యకార్మికుల సంఖ్య 112 దేశాల జనాభా కన్నా ఎక్కువ. సముద్రతీరం వెంబడి ఉత్పత్తి అవుతున్న చేపలు ఎన్నో కోట్లమందికి ఆహార భద్రతను చేకూర్చుతోంది. మత్స్యకార్మికులకు ఇప్పుడు అయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీలు, కేంద్ర సహకారం ఇంకా పెరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సబ్సిడీలు పెంచాలని గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో మత్స్యకార్మిక సంఘాలు కేంద్రానికి అనేకమార్లు విన్నవించుకున్నాయి. జీవనోపాధి కోసం చేపలవేట సాగిస్తున్న కార్మికుల సబ్సిడీలను ఆపేయవద్దని సంఘాల ప్రతినిధులు మోడీ సర్కార్‌ను కోరుతున్నారు.