Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెనీవాలో ప్రారంభమైన డబ్యూటీఓ సమావేశాలు
జెనీవా : కరోనా వంటి మహమ్మారులు, ఆహార కొరత, వాతావరణ మార్పులు, ప్రాంతీయ ఘర్షణలు వంటి పలు సంక్షోభాలను ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయని డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ నగొజి ఒకొన్జొ-ఇవెలా పేర్కొన్నారు. ఈ కష్టాలు, ఇబ్బందులను అధిగమించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కోలుకునేలా అందరం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జెనీవాలోని డబ్ల్యూటీఓ ప్రధాన కార్యాలయంలో ఆదివారం డబ్ల్యూటీఓ 12వ మంత్రిత్వ స్థాయి సమావేశం ప్రారంభమైంది. రెండేండ్లకోసారి జరిగే ఈ సమావేశాల్లో 164 సభ్య దేశాలకు చెందిన వాణిజ్య మంత్రులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొంటున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో వాణిజ్య సంఘాల ప్రతినిధులు, సభ్యులు కోవిడ్ వ్యాక్సిన్లకు ట్రిప్స్ (వాణిజ్య సంబంధిత అంశాల మేథోసంపత్తి హక్కులు) రద్దు, కరోనాపై పోరు, మత్స్య రాయితీలు, వ్యవసాయం, ఆహార భద్రత వంటి అంశాలపై చర్చిస్తారు. దీనితో పాటు డబ్ల్యుటిఓ సంస్కరణలు, భవిష్యత్తులో దాని ప్రాధాన్యతలపై కూడా చర్చించనున్నారు. ఏ ఒక్క దేశమూ కూడా సొంతంగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోలేదని, వీటిపై యావత్ ప్రపంచ దేశాలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం వుందని ఇవెలా స్పష్టం చేశారు. డబ్ల్యూటీఓ కొంత పురోగతిని సాధించిందని, కీలకమైన అంశాలపై ముసాయిదా పత్రాలు సిద్ధమయ్యాయని చెప్పారు. ఈ సమావేశాల్లో మరిన్ని ఫలితాలు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా వాణిజ్య మంత్రి వాంగ్ వెంటావో మాట్లాడుతూ, డబ్ల్యూటీఓ కేంద్రీకృత బహుముఖ వాణిజ్య వ్యవస్థ, అంతర్జాతీయ వాణిజ్యానికి మూల స్తంభం వంటిదని వ్యాఖ్యానించారు. కరోనా ప్రభావం నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో డబ్ల్యూటీఓ బృహత్తర పాత్ర పోషించేలా అన్ని పక్షాలతో కలిసి పనిచేసేందుకు తాము సుముఖంగా వున్నామని చెప్పారు.