Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటి నల్ల జాతి ఉపాధ్యక్షురాలిగా ఫ్రాన్సియా మార్క్వెజ్
బొగొటా : కొలంబియా అధ్యక్షుడిగా వామపక్ష అభ్యర్ధి గుస్తావో పెట్రో ఎన్నికయ్యారు. రెండో రౌండ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధి రొడాల్ఫో హెర్మాండెజ్ను ఆయన ఓడించారని ప్రభుత్వ రంగంలోని నేషనల్ సివిల్ రిజిస్ట్రీ పేర్కొంది. 99.99శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి, వామపక్షాలకు చెందిన హిస్టారిక్ పాక్ట్ ఫర్ కొలంబియా కొయిలేషన్ అభ్యర్ధి పెట్రోకు 1,12,80,694 ఓట్లు లభించాయి. అంటే 50.44శాతం ఓట్లు వచ్చాయి. హెర్మాండెజ్కు 1,05,79,803 ఓట్లు అంటే 47.31శాతం ఓట్లు లభించాయి. దేశ మొదటి నల్ల జాతి ఉపాధ్యక్షురాలిగా ఫ్రాన్సియా మార్క్వెజ్ ఎన్నికయ్యారు. పని మనిషి స్థాయి నుంచి దేశ ఉపాధ్యక్షురాలి స్థాయి వరకు ఫ్రాన్సియా ఎదిగిన క్రమం ఎంతో స్ఫూర్తిదాయకం. కొలంబియా కొత్త శకం ఆరంభమైందనీ, ఇది విజయోత్సవాలు జరుపుకునే రోజని పెట్రో ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ''ప్రప్రథమ ఈ ప్రజా విజయాన్ని మనందరం జరుపుకుందాం. ఈ విజయం, ప్రజలది, చరిత్రది.'' అని పెట్రో ట్విట్టర్లో పేర్కొన్నారు. పెట్రోకి ఫోన్ చేసి అభినందనలు తెలియచేసినట్టు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డుక్యూ ట్వీట్ చేశారు. పెట్రో (62) సెనెటర్‌గా, రాజధాని బొగొటా మాజీ మేయర్‌గా వున్నారు. నాలుగేండ్ల పదవీకాలానికి ఆగస్టు 7న ఆయన అధ్యక్షునిగా బాధ్యతలు చేపడతారు. తొలుత ఓటింగ్ క్రమం సాఫీగా సాగుతున్నదని అధికారులు ప్రకటించారు. కానీ అంతిమంగా ఒక సైనికుడితో సహా ఇద్దరు మృతి చెందినట్టు సమాచారం అందింది. కొలంబియాలోని రివల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ జరిపిన దాడిలో ఒక సైనికుడు మరణించాడని రక్షణ మంత్రి డీగో మోలానో చెప్పారు. మరో సంఘటనలో ఎన్నికల వలంటీర్‌ను కూడా హతమార్చారు. వాటిపై దర్యాప్తు జరుగుతోందన్నారు.
లాటిన్ అమెరికా నేతల అభినందనల వెల్లువ
లాటిన్ అమెరికా దేశాధినేతలు, మాజీ అధ్యక్షులు, ప్రముఖులు పలువురు గుస్తావో పెట్రో చారిత్రక విజయం పట్ల అభినందనలు తెలియచేశారు. క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్ కానెల్ అభినందన సందేశం పంపుతూ ఇదొక చారిత్రక ప్రజా విజయమన్నారు. మన ప్రజల సంక్షేమం కోసం ద్వైపాక్షిక సంబంధాలను అభివృద్ధిపరుచుకోవాల్సి వుందన్న ఆకాంక్షను వ్యక్తంచేశారు.