Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : యాంటీ బాలిస్టిక్ క్షిపణి పరీక్షను చైనా ఆదివారం విజయవంతంగా నిర్వహించింది. దేశ రక్షణాభివృద్ధిలో ఇదొక కీలకమైన భాగమని పేర్కొంది. ఆధునిక, అణ్వాయుధ, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులతో చైనాను బ్లాక్మెయిల్ చేసేందుకు అమెరికా చేసే ప్రయత్నాల నేపథ్యంలో, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనా ముంగిట ఇంటర్మీడియెట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను మోహరిస్తున్నందువల్ల చైనా యాంటీ బాలిస్టిక్ క్షిపణి ఛత్రం వాస్తవికతను తెలియచెప్పేలా చైనా ఈ పరీక్ష నిర్వహించింది. చైనా తన సరిహద్దుల పరిధిలోనే ఈ పరీక్షను చేపట్టిందని జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం పొద్దుపోయిన తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది. ఆశించిన లక్ష్యాన్ని ఈ పరీక్ష చేరుకుందని వెల్లడించింది. ఏ దేశంపై ప్రయోగించేందుకు ఉద్దేశించిన పరీక్ష కాదని, తమ దేశాన్పి కాపాడుకునే ప్రయత్నంలో భాగమని స్పష్టం చేసింది. గతేడాది ఫిబ్రవరిలో కూడా ఇదే తరహాలో పరీక్ష నిర్వహించారు. క్షిపణి మార్గాంతరంలోనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకోవడమనేది ఈ దశలో అత్యంత సవాలు కలిగిన అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా ఈ క్షిపణికి అణు శీర్షాలు సమకూరుస్తారు. అత్యంత వేగంతో వాతావరణ పరిధికి వెలుపల ఇది ప్రయాణిస్తుందని పేర్కొన్నారు.