Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా: బంగ్లాదేశ్‌లో పద్మా నదిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'పద్మా వంతెన'ను ప్రధాని షేక్ హసీనా శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. రోడ్డు, రైలు మార్గాలు కలిగి ఉన్న ఈ మల్టీపర్పస్ వంతెన.. దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జ్ కావడం విశేషం. రాజధాని నగరం ఢాకా.. ప్రాంతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన మోంగ్లా ఓడరేవు మధ్య దూరాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది. అదే విధంగా.. దేశంలో వెనుకబడిన నైరుతి ప్రాంతాన్ని ఢాకాతోపాటు మిగిలిన ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. ''ఈ వంతెన కేవలం ఇటుకలు, సిమెంట్, స్టీల్, కాంక్రీట్ కలగలిపిన నిర్మాణం మాత్రమే కాదు.. మన శక్తిసామర్థ్యాలు, గౌరవానికి చిహ్నం. ఈ వంతెన బంగ్లాదేశ్ ప్రజలది' అని ప్రధాని షేక్ హసీనా ప్రారంభోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రధాన వంతెన పొడవు మొత్తం 6.15 కిలోమీటర్లు. ఇందులో రైల్వే వయాడక్ట్ పొడవు 532 మీటర్లు కాగా, నాలుగు లేన్ల రోడ్డు వయాడక్ట్ పొడవు 3.14 కి.మీ. దీనికి దాదాపు 3.6 బిలియన్ డాలర్ల వ్యయమైంది. అవినీతి ఆరోపణలతో ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేం దుకు నిరాకరించగా.. పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించారు. చైనాకు చెందిన రైల్వే మేజర్ బ్రిడ్జ్ ఇంజినీరింగ్ గ్రూప్ ఈ బ్రిడ్జ్‌ను నిర్మించింది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ వంతెనను నిర్మించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, బంగ్లాదేశ్ వాటిని కొట్టిపారేసింది.