Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీ 7 సదస్సు సందర్భంగా అమెరికా, ఫ్రాన్స్, కెనడా నేతలతో ప్రధాని భేటీ
ఎల్మావు : జర్మనీలో జరుగుతున్న జి 7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అమెరికా, కెనడా, ఫ్రాన్స్ దేశాల నేతలతో భేటీ అయ్యారు. గ్రూపు ఫోటో తీసుకోవడానికి ముందుగా సదస్సు వేదిక వద్దనే ఆయా నేతలతో మోడీ విడివిడిగా సమావేశమయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం జర్మనీ వచ్చిన మోడీకి తొలుత జర్మన్ ఛాన్సలర్ ఓల్ఫ్ షుల్జు సాదరంగా స్వాగతం పలికారు. జీ 7 సదస్సులో ఫోటో సెషన్ ప్రారంభమవడానికి ముందుగానే అమెరికా అధ్యక్షుడు బైడెన్, మోడీ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి పరస్పరం కరచాలనం చేసుకుని, పుష్పగుచ్ఛాలు అందించుకున్నారు. గ్రూపు ఫోటోలో కెనడా ప్రధాని పక్కన నిలుచుకున్న మోడీ ఆయనతో కూడా కరచాలనం చేసి మాట్లాడారు. ఇక గ్రూపు ఫోటో అనంతరం ఫ్రాన్స్ నేత మాక్రాన్, మోడీ మరింత ఉల్లాసంగా కాసేపు మాట్లా డుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. మిగిలినవారు సమావేశం కోసం లోపలకు వెళ్ళినా వీరిద్దరు మాత్రం కాసేపు మాట్లాడుకుని, తర్వాత కలిసి వెళ్ళారు. ప్రపంచ నేతలతో జి 7 సదస్సు వేదిక వద్ద అంటూ గ్రూపు ఫోటోను ప్రధాని ట్వీట్ చేశారు. జి 7 సదస్సుకు రావాల్సిందిగా భారత్, అర్జెంటైనా, ఇండోనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికా నేతలను కూడా జర్మనీ నాయకత్వం ఆహ్వానించింది. భాగస్వామ్య దేశాలతో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు ఛాన్సిలర్ షుల్జు వేచి చూస్తున్నారు. ''అంతర్జాతీయంగా వున్న బాధ్యతల గురించి పటిష్టమైన ప్రజాస్వామ్య దేశాలకు తెలుసు. సుస్థిరమైన రీతిలో పెట్టుబడులు పెట్టడం, ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతను మెరుగు పరచడం, అంతర్జాతీయ ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం, ప్రజా స్వామ్య దేశాలు మరింత ధృఢంగా వుండేలా చూడడం కోసం నిర్దిష్టమైన చొరవలు చేపట్టడం మా లక్ష్యం.'' అని అధికారిక ప్రకటన పేర్కొంది.