Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 51 మంది ఖైదీలు మృతి
- జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఘటన
బొగొటా: కొలంబియాలోని ఓ జైల్లో విషాదం చోటుచేసుకుంది. జైలు నుంచి తప్పించుకునే క్రమంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో 51 మంది ఖైదీలు మృతి చెందారు. మరో నలభై మందికి పైగా ఖైదీలు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్టు అధికారులు వెల్లడించారు. జైలులో జరిగిన ఈ సంఘటన అత్యంత విషాదకరమైనదని అక్కడి జాతీయ కారాగార విభాగం పేర్కొంది. 'తులువా నగరంలోని కారాగారంలో ఖైదీలు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో పరుపులకు కొందరు నిప్పంటించడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తున్నది. దాంతో వారంతా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 51 మంది ఖైదీలు చనిపోయారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చు' అని కొలంబియా జాతీయ జైళ్లశాఖ విభాగం అధికార ప్రతినిధి వెల్లడించారు. తులువాలో జరిగిన ఘటనపై కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ దుక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు.