Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగేండ్లలో ఐదోసారి
జెరూసలేం : నాలుగేండ్ల కాలంలో ఐదోసారి ఎన్నికల దిశగా ఇజ్రాయిల్ పయనిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయిల్ తీవ్ర రాజకీయ అనిశ్చితిలో కూరుకుపోయింది. మరోవైపు జీవన వ్యయాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటల కారణంగా పాలక సంకీర్ణం ఇక ఎంతో కాలం కొనసాగేలా లేకపోవడంతో పార్లమెంట్‌ను రద్దు చేయాలని ప్రధాని నఫ్తాలి బెర్నెట్ గత వారం ప్రతిపాదించారు. దీనిపై తుది ఓటుకు బుధవారం అర్ధరాత్రి వరకు గడువు వుంది. పార్లమెంట్‌ను రద్దు చేయడం ఖరారుగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఎన్నికలకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసినట్లైతే, ప్రస్తుత సంకీర్ణాన్ని కాపాడే లేదా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నాలు, ఒప్పందాలు చివరి నిముషం వరకు కుదరకపోతే, 8 పార్టీలతో కూడిన బెర్నెట్ పాలన ముగుస్తుంది. విదేశాంగ మంత్రి యార్ లపిడ్ పరిమిత అధికారాలతో ప్రధానిగా పగ్గాలు చేపడతారు. ఇదిలా వుండగా, మధ్యంతర ఎన్నికలకు అక్టోబరు 25 లేదా నవంబరు 1 ఈ రెండు తేదీల్లో ఏదో ఒకటి ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఎన్నికల తేదీ కూడా ఖరారు కాకముందే మాజీ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం వుందంటూ ప్రచారం ప్రారంభమైంది. లపిడ్, బెర్నెట్ ఇరువురు కలిసి మితవాదులు, ఉదారవాదులు, అరబ్ పార్టీలతో కలిసి అరుదైన కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా నెతన్యాహు 12 ఏళ్ల రికార్డు పాలనకు తెర పడింది. అయితే చాలామంది ఊహించిన దానికన్నా ఎక్కువ కాలమే ఈ ప్రభుత్వం సాగింది. ఇటీవల కాలంలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ఇజ్రాయిల్ చరిత్రలోనే అత్యంత అధ్వాన్నమైన ప్రభుత్వమంటూ వ్యాఖ్యానించిన నెతన్యాహు తాజా పరిణామాల పట్ల ఆనందంగా వున్నారు. అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటు న్నప్పటికీ ఆరవసారి అధికారం చేపడతానని ఆశిస్తున్నారు.