Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వ్యాఖ్యలు
- కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా జాన్ లీ ప్రమాణ స్వీకారం
హాంకాంగ్ సిటీ : ప్రస్తుతం హాంకాంగ్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. పూర్వపు బ్రిటీష్ వలస దేశమైన హాంకాంగ్‌ను చైనాకు అప్పగించి శుక్రవారంతో 25ఏళ్ళు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమానికి జిన్‌పింగ్ హాజరయ్యారు. హాంకాంగ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా జాన్ లీ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హాంకాంగ్‌లో నెలకొన్న కోవిడ్ ఆందోళనకర పరిస్థితుల దృష్ట్యా జిన్‌పింగ్ ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై చివరి వరకు అనిశ్చితి నెలకొంది. గురువారం కార్యక్రమానికి హాజరైన జిన్‌పింగ్ ఇక్కడ బస చేయకుండా చైనాలోని షెంఝాన్ వెళ్ళిపోయి తిరిగి శుక్రవారం ఇక్కడకు వచ్చారు. ''ఆందోళనకర పరిస్థితుల నుండి శాంతి భద్రతల దిశగా పరివర్తన'' అంటూ జిన్‌పింగ్ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని వ్యాఖ్యానించారు. ''ఎన్నో ఎత్తుపల్లాలు అధిగమించిన తర్వాత, ప్రజలు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇకపై అస్థిరత, అల్లకల్లోలం, గందరగోళం వుండవు'' అని పేర్కొన్నారు. కేంద్ర అధికారుల సర్వ పర్యవేక్షణలోవుంటూ, అత్యున్నత స్థాయిలో ఎస్ఎఆర్ స్వయంప్రతిపత్తిని పరిరక్షించడం ఈ విధానంలో కీలకాంశాలని జిన్‌పింగ్ పేర్కొన్నారు. 'ఈ రెండూ సక్రమంగా నిర్వహిస్తేనే ఎస్ఎఆర్ను సమర్ధవంతంగా నడపగలం'' అన్నారు. నూతన హాంకాంగ్ నేత లీ కి, ఒక దేశం, రెండు వ్యవస్థలకు చైనా పూర్తిగా మద్దతిస్తుందన్నారు. జాతీయ సార్వభౌమాధికారాన్ని, భద్రతను, అభివృద్ధి ప్రయోజనాలను పరిరక్షించడం ఈ విధానంలోని కీలక సూత్రం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సూత్రం ఆధారంగా హాంకాంగ్, మకావు దీవులు తమ పెట్టుబడిదారీ వ్యవస్థను కొనసాగిస్తూ, అత్యున్నత స్థాయి స్వయం ప్రతిపత్తిని కొనసాగిస్తాయని అన్నారు.