Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరేడ్‌లో పాల్గొన్నవారిపై చక్షణారహితంగా...
- ఆరుగురు మృతి.. 24మందికి గాయాలు
వాషింగ్టన్ : అమెరికాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చికాగో సమీపంలోని ఇలినాయిస్‌లో స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్నవారిపై రాబర్ట్ క్రిమో(22) అనే వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ సంఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సుమారు 24మందికి గాయాలయ్యాయి. వీరికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. షికాగో శివారులోని హైల్యాండ్ పార్క్‌లో అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుండగా (భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి) ఈ సంఘటన చోటుచేసుకుంది. వేడుకలు ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో రోజంతా నిర్వహించ తలపెట్టిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలను పూర్తిగా రద్దుచేశారు. పరేడ్ జరుగుతున్న ప్రదేశానికి సమీపంలోని రిటైల్ దుకాణం పైకెక్కి దుండగుడు కాల్పులు జరిపినట్టు స్థానిక వార్తాకథనాలు పేర్కొన్నాయి. సుమారు 20-25 సార్లు తుపాకీ పేలిన శబ్దాలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో పరేడ్‌ను తిలకిస్తున్న ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. కాల్పుల ఘటనపై అమెరికాపై అధ్యక్షుడు జోబైడెన్ స్పందించారు. ఈ ఘటన తనను షాక్‌కు గురిచేసినట్టు పేర్కొన్నారు. మతిలేని ఈ ఘటన స్వాతంత్య్ర దినోత్సవం రోజున అమెరికాలో విషాదాన్ని నింపిందని పేర్కొన్నారు. కాల్పుల ఘటనకు సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇక్కడ పరేడ్‌ను చూసేందుకు ఉత్సాహంగా వచ్చి వీధి పక్కనే కూర్చొన్న ప్రేక్షకులు..కాల్పులు ప్రారంభం కాగానే తీవ్ర భయాందోళనలతో ప్రాణాలు అరచేత పెట్టుకొని పరుగులు తీస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
'గన్‌షాట్స్' అంటూ జనం పరుగుల తీస్తున్న వీడియోలు వెంటనే సోషల్ మీడియాలో వచ్చాయి. వేగంగా వెంట వెంటనే కాల్పులు శబ్దాలు రావడాన్ని బట్టి చూస్తే...నిందితుడు హ్యాండ్‌గన్, షాట్‌గన్ లాంటివి కాకుండా వేరే తుపాకీని వాడినట్టు తెలుస్తోందని మరో ప్రత్యక్షసాక్షి తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లొద్దని ప్రజలకు పోలీసులు సూచించారు. ఈ సంఘటనతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిలిపివేశారు. ఆ ప్రాంతంలో ఉన్నవారు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. గన్ కల్చర్‌ను నియంత్రించే ఉద్దేశంతో అమెరికా జూన్ నెలాఖర్లో ఓ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే తాజా కాల్పుల సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికాలో కాల్పులు, తుపాకీతో ఆత్మహత్యల కారణంగా ఏటా సుమారు 40వేలమంది చనిపోతున్నట్టు కొన్ని అంచనాలు పేర్కొంటున్నాయి.