Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేసులో నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ ?
లండన్ : ఎట్టకేలకు బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ నేతల నుండి, తన సహచరుల నుండి వచ్చిన ఒత్తిళ్ళ మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా కూడా ఆయన వైదొలగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త నేత ఎంపిక క్రమం ప్రారంభమవుతుందని జాన్సన్ ప్రకటించారు. కాగా కొత్త ప్రధాని ఎన్నికయ్యేవరకు ఆపద్ధర్మ ప్రధానిగా జాన్సన్ కొనసాగనున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు గానూ కొత్త మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటుచేశారు. తన ప్రభుత్వాన్ని వరుసగా కుంభకోణాలు పట్టి పీడిస్తున్నప్పటికీ ఆయన రాజీనామా చేసేందుకు తిరస్కరిస్తూనే వచ్చారు. గత రెండు రోజులుగా 40మందికి పైగా మంత్రులు, అధికారులు రాజీనామాలు చేసి, ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ఇక అనివార్య పరిస్థితుల్లో గద్దె దిగక తప్పలేదు. రాజీనామాకు కొద్ది సమయం ముందుగా ట్రెజరీ చీఫ్ నదిమ్ జవావి, ప్రధాని జాన్సన్‌తో భేటీ అయ్యారు. కొద్ది గంటలకు ముందుగానే నియమితులైన జవావి కూడా జాన్సన్ రాజీనామాకే మొగ్గుచూపారు. 'చేయాల్సిన సరైన పని ఏమిటో ఆయనకు తెలుసు' అంటూ జవావి వ్యాఖ్యానించారు. ఆయన సూచన మేరకే ఈ రాజీనామా ప్రకటన వెలువడినట్లు భావిస్తున్నారు. మంగళవారం రాజీనామా చేసిన ఆర్థిక మంత్రి రిషి సునాక్ స్థానంలో జవావిని బుధవారం జాన్సన్ నియమించారు. జాన్సన్‌కు అత్యంత సన్నిహితులైన కేబినెట్ మంత్రులు, ఇతర సహచరుల బృందం బుధవారం ప్రధానిని కలిశారు. పార్టీలో విశ్వాసం కోల్పోయిన తర్వాత ఇక పదవిలో కొనసాగరాదంటూ ఆయనకు సూచించారు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వం గత కొంత కాలంగా వరుస వివాదాలను ఎదుర్కొంటోంది. కోవిడ్ లాక్డౌన్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించి అధికార నివాసంలో పార్టీలు జరుపుకున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న జాన్సన్ వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి. అయినా వాటికి తలొగ్గలేదు. గతంలో ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా పించర్‌ను జాన్సన్ నియమించారు. అప్పటికే ఆయన నడవడిక సరిగా లేదంటూ ఆరోపణలు వున్నా వాటిని పట్టించుకోకుండా నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పించర్, క్లబ్లో ఇద్దరు వ్యక్తులతో అసభ్యంగా వ్యవహరించాడన్న ఆరోపణల నేపథ్యంలో మళ్ళీ ఈ విషయం తెరపైకి వచ్చింది. పించర్ నడవడిక సరిగా లేదని తాము తెలియచేసినా వినిపించుకోకుండా జాన్సన్ ఆయన్ని నియమించారని మాజీ అధికారి ఒకరు వెల్లడించారు. దాంతో మరోసారి జాన్సన్ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన, ఇటీవల రాజీనామా చేసిన ఆర్థిక మంత్రి రిషి సునాక్ పేరు వినిపిస్తోంది. ఆయన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి అల్లుడు.