Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల ప్రచారంలో దుండగుడి కాల్పులు
టోక్యో : జపాన్ మాజీ ప్రధాని షింజో అబె(67) దారుణ హత్యకు గురయ్యారు. నరా నగరంలోని ఓ వీధిలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) అభ్యర్థుల తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా.. దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. కాగా, ఆయన మృతి చెందినట్టు ఎల్డీపీ వర్గాలు మధ్యాహ్నం ధ్రువీకరించాయి. అత్యంత సమీపం నుంచి దేశీయ తుపాకీతో రెండు సార్లు ఈ కాల్పులు జరగడంతో అబె ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో అబె ఛాతీ పట్టుకుని వేదికపైనే కుప్పకూలారు. ఘటన అనంతరం షింజో అబెను నరా మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన శరీరం చికిత్స స్పందించట్లేదని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. బుల్లెట్ గాయాల కారణంగా అబె శరీరంలో అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం అయినట్టు తెలిపాయి. నాలుగున్నర గంటల పాటు అబెకు చికిత్స అందించినప్పటికీ.. వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. షింజో అబె 2006లో తొలిసారి జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2006 నుంచి 2007 వరకు ఈ పదవిలో కొనసాగారు. అనంతరం 2012 నుంచి 2020 వరకు ప్రధానిగా వ్యవహరించారు. జపాన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఈయనే. 2020లో అనారోగ్య కారణాలతో అబె పదవి నుంచి దిగిపోయారు.
అసంతప్తితోనే కాల్పులు జరిపా : పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడి
నిందితుడు తుడు టెత్సుయా యమగామి(41) అని, జపనీస్ మారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మాజీ సభ్యుడని గుర్తించారు. అబేపై కాల్పులు జరిపిన తుపాకీని స్వయంగా తయారు చేసినట్టు అధికారులు తెలిపారు. అతని నివాసం నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 'షింజో అబేపై అసంతృప్తితో ఉన్నాననీ, అందుకే ఆయన్ని చంపాలని నిర్ణయించుకున్నా'నని నిందితుడు విచారణలో పోలీసులకు చెప్పినట్టు సమాచారం.
ప్రధానిమోడీ దిగ్భ్రాంతి ..
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేని హత్యపై భారత ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. షింజో అబేకు నివాళిగా భారత్ రేపు(జూలై 9) ఒక రోజు పాటు జాతీయ సంతాప దినం పాటించాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. షింజో అబేతో తనకు ఉన్న స్నేహం గురించి ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. జపాన్- ఇండియా సంబంధాల బలోపేతానికి అబే కృషి చేశారనీ, జపాన్- ఇండియా అసోసియేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. షింజో అబే కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే తనకు షింజో అబేతో అనుబంధం ఉందని, ప్రధాని అయిన తర్వాత మా స్నేహం కొనసాగిందని..ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ వ్యవహారాలపై ఆయన అవగాహన చాలా లోలైనదని అన్నారు.