Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనాలో తొలిసారి వెలుగు చూసిన మార్బర్గ్ వైరస్
- అప్రమత్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ
జెనీవా : ప్రపంచ దేశాలను ప్రాణాంతక వైరస్లు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎబోలా, కరోనా వంటి వైరస్‌లతో ప్రపంచం ఇబ్బంది పడుతున్న వేళ.. మరో ప్రమాదకర వైరస్ బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికాలోని ఘనా దేశంలో అతి ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వెలుగు చూసింది. రెండు వారాల క్రితమే రెండు కేసులు నమోదు కాగా.. వ్యాధి సోకిన ఆ ఇద్దరు బాధితులూ ప్రాణాలు కోల్పోయారు. దీనిని ధ్రువీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇద్దరు బాధితులతో సన్నిహితంగా మెలిగిన 34 మందిని గుర్తించినట్టు తెలిపింది. ప్రస్తుతం వారిని క్వారంటైన్లో ఉంచి, వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించింది.
'ఘనాలోని సదరన్ అశాంతి ప్రాంతంలో మార్బర్గ్ వైరస్‌కు సంబంధించి రెండు అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. ప్రాథమిక విశ్లేషణ కోసం బాధితుల నుంచి నమూనాలను సేకరించాం. అయితే, ఆ ఇద్దరు బాధితులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. పూర్తి నిర్ధారణ కోసం సెనెగల్‌లోని పాశ్చర్ ఇన్స్టిట్యూట్కు నమూనాలను పంపించాం. స్థానికంగా ఈ వైరస్ మరింత వ్యాప్తిచెందే అవకాశం ఉన్న దష్ట్యా కట్టడి చర్యలకు ఏర్పాట్లు చేస్తున్నాం' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. చనిపోయిన ఇద్దరు బాధితుల్లోనూ డయేరియా, జ్వరం, వికారం, వాంతుల వంటి లక్షణాలు కనిపించినట్టు తెలిపింది.
88శాతం ప్రాణాంతకమే
ఎబోలా కుటుంబానికి చెందిన మార్బర్గ్ వైరస్ కారణంగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ముఖ్యంగా గబ్బిలాల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన జంతువులు/వ్యక్తుల స్రావాలను నేరుగా తాకడం వల్ల లేదా అవి తాకిన ప్రదేశాలను ముట్టుకోవడం వల్ల మానవుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వైరస్ సోకిన రెండు నుంచి 21 రోజుల్లో ఇది బయటపడుతుంది. అధిక జ్వరం, తీవ్ర తలనొప్పి, ఆయసం వంటి లక్షణాలతో అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం బారి నపడతారు. ఏడు రోజుల్లోనే చాలా మంది బాధితుల్లో రక్తస్రావం కనిపిస్తుంది. అనంతరం ఇది ప్రాణాంతకంగా మారుతుంది. మరణాల రేటు 88శాతం వరకూ ఉంటుంది. వైరస్ నివారణ, చికిత్సకు ఎటువంటి వ్యాక్సిన్లు లేదా యాంటీవైరల్ చికిత్స లేదు. లక్షణాలను బట్టి చికిత్స చేయడంతోపాటు అధిక ద్రవాలను అందించడం ద్వారా బాధితులకు ప్రాణాపాయం నుంచి రక్షించే ప్రయత్నం చేయవచ్చు. ఈ వైరస్ బాధితులకు జ్వరం, రక్త విరేచనాలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, శరీరంలో అంతర్గత రక్తస్రావం, కళ్లు కూడా ఎర్రగా మారడం, మూత్రంలోనూ రక్తం కనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ వైరస్ కొత్తది కాదని దక్షిణ, తూర్పు ఆఫ్రికా ప్రాంతాల్లో 1967 నుంచి ఈ వైరస్‌కు సంబంధించిన కేసులు అప్పుడప్పుడు వెలుగు చూస్తూనే ఉన్నాయి.