Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని నివాసానికి నిప్పు
- అధ్యక్షుడి పలాయనం!
- ఆర్మీ ప్రధాన కార్యాలయానికి గోటబయ రాజపక్స తరలింపు
- పరిస్థితి చేయిదాటిపోయిందని ప్రధాని రణిల్ విక్రమసింఘే రాజీనామా
కొలంబో: నిరసన జ్వాలలతో శ్రీలంక అట్టుడుకుతోంది. శనివారం నాడు అధ్యక్ష నివాసంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు.. సాయంత్రం ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రయివేటు నివాసానికి నిప్పంటించారు. ప్రధానిగా రణిల్ రాజీనామా నిర్ణయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆందోళనకారులు ప్రధానికి చెందిన కొన్ని వాహనాలనూ ధ్వంసం చేసినట్టు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. 'ఆందోళనకారులు ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసంలోకి చొరబడి నిప్పంటించారు' అని ప్రధాని కార్యాలయం సైతం వెల్లడించింది.
గోటబయ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసనకారులు శనివారం అధ్యక్షుడి భవనాన్ని చుట్టుముట్టారు. నిరసనకారుల ఆగ్రహాన్ని పసిగట్టిన నిఘా వర్గాలు గోటబయ రాజపక్సను అధికారిక నివాసం నుంచి ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించాయని శ్రీలంక రక్షణవర్గాలు వెల్లడించాయి. పరిస్థితి అదుపు తప్పే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారమివ్వడంతో శుక్రవారం రాత్రే అధికారిక నివాసాన్ని రాజపక్స ఖాళీ చేశారని తెలిసింది. ఆర్థిక సంక్షోభాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వేలాది మంది రోడ్లమీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. కొలంబోలో వీధులన్నీ నిరసనకారులతో నిండిపోయాయి.
అధ్యక్ష భవనం వద్ద రణరంగం
అధ్యక్ష భవనాన్ని చుట్టుముడుతున్న ఆందోళనకారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో సమూహాన్ని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. నిరసనల హోరుతో అధికారిక నివాసం రణరంగంగా మారింది. శ్రీలంక జాతీయ జెండాను చేతబూని నిరసనకారులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, ఉద్యమకారులు, బార్ అసోసియేషన్ సభ్యులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. మరోవైపు రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. కాగా, తాజా ఘర్షణల్లో 30మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. శ్రీలంక కొన్నాండ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. ద్రవ్యోల్బణం సైతం భారీగా పెరిగింది. ఇంధన సంక్షోభం ముదిరింది. శ్రీలంకను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సాయం కోసం చర్చలు జరుగుతున్నాయి.