Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో: శ్రీలంకలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శనివారం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంటిని ముట్టడించిన నిరసనకారులు అక్కడే వంటావార్పు చేసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమా ల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో భవనంలో పెద్ద మొత్తంలో కరెన్సీ కట్టలను ఆందోళనకారులు గుర్తించినట్లు డైలీ మిర్రర్ అనే పత్రిక పేర్కొంది. వాటిని లెక్కించి పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించింది.
దేశం విడిచి వెళ్లిపోయరా?
మరోవైపు ఆందోళనకారుల ముట్టడిని ముందుగానే పసిగట్టిన గొటబాయ రాజపక్స శుక్రవారమే అధ్యక్ష భవనం నుంచి వెళ్లిపోయారు. అయితే, ఆయన ప్రస్తుతం ఎక్కడ తలదాచుకున్నారో, సంక్షోభ సమయంలో ఆయనకు ఎవరు ఆశ్రయం కల్పిస్తున్నారనే అంశంపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఆయన దేశం విడిచి వెళ్లిపోయి ఉంటారనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఆయన కనపడకుండా పోయినప్పటి నుంచి స్పీకర్‌కు రాజీనామా చేస్తానని తెలియజేయడం తప్ప మరో ప్రకటన బయటకు రాలేదు.
కొత్త అధ్యక్షుడు ఏవరు?
బుధవారం నాటికి రాజీనామా చేస్తానని గొటబాయ స్పీకర్ మహింద అబేయవర్దెనకు సమాచారం అందజేశారు. ఆయన బాధ్యతల నుంచి దిగిపోయిన తర్వాత శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ప్రధాని విక్రమసింఘే అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కేబినెట్లో ఒకరు పీఎం బాధ్యతలు చేపట్టాలి. కానీ, విక్రమసింఘే కూడా బుధవారం రాజీనామా చేస్తానని ప్రకటించడంతో తదుపరి అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు అధ్యక్ష బాధ్యతల్లో స్పీకర్ కొనసాగుతారు.