Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంక అధ్యక్ష భవనంలో ఆందోళనకారుల వంటావార్పు!
- గొటబయ రాజపక్స ఎక్కడున్నారో తెలియని పరిస్థితి
- బుధవారం అధ్యక్షుడు రాజీనామా చేస్తారని స్పీకర్ ప్రకటన
- శాంతి నెలకొనేందుకు ప్రజలు సహకరించాలి : సైన్యం
కొలంబో : శ్రీలంకలో నిరసనల హోరు కొనసాగుతోంది. పాలకులపై ఆగ్రహంతో అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు ఆదివారమూ అక్కడే ఉన్నారు. అధ్యక్ష భవనంలో నిరసనకారులు వంటవార్పూ చేసుకుంటున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు విడుదలయ్యాయి. భవనంలో రూ.కోటి రూపాయలకుపైగా విలువజేసే నోట్ల కట్టలను ఆందోళనకారులు గుర్తించినట్టు డైలీ మిర్రర్ అనే పత్రిక పేర్కొంది. నిరసనకారులు వాటిని లెక్కించి పోలీసులకు అప్పగించారని వెల్లడించింది. అధ్యక్ష భవనాన్ని వీడి పారిపోయిన గొటబయ రాజపక్స, ప్రస్తుతం ఎక్కడ తలదాచుకున్నది తెలియదు. బుధవారం నాటికి తన పదవికి రాజీనామా చేస్తానని గొటబయ రాజపక్స స్పీకర్ మహింద అబేయవర్దెనకు సమాచారం అందజేశారు. ఆయన బాధ్యతల నుంచి దిగిపోయిన తర్వాత శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ప్రధాని రణిల్ విక్రమసింఘే అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కేబినెట్లో ఒకరు పీఎం బాధ్యతలు చేపట్టాలి. కానీ విక్రమసింఘే కూడా బుధవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. దాంతో తదుపరి అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు అధ్యక్ష బాధ్యతల్లో స్పీకర్ కొనసాగుతారు. అధ్యక్షుడు రాజీనామా సమర్పించిన మూడు రోజుల్లోగా పార్లమెంటు సమావేశమై కొత్త అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. నెలలోపు కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకోవాలి. ఇదిలా ఉండగా, శ్రీలంకలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఆ దేశ సైన్యం స్పందించింది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు ఇప్పుడు అవకాశం లభించిందని ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ శవేంద్ర సిల్వ అన్నారు. దీన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ప్రజల మద్దతు అవసరమని ప్రకటించారు. సైన్యం, పోలీసులకు సహకరించి శాంతి నెలకొల్పేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
ఆకాశాన్నంటిన ధరలే కారణం!
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను తన దౌత్యం, రాజకీయ చతురత, అనుభవంతో ఒడ్డునపడేస్తాడని ప్రధానిగా రణిల్ విక్రమసింఘేను రాజపక్స నియమించాడు. కానీ శ్రీలంకలో పరిస్థితులు ఏమాత్రమూ కుదుటపడలేదు. కనీస నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలు ఏమీ కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇంధన కొరత అనేకమంది ఉపాధిని దెబ్బతీస్తోంది. విదేశీ మారక నిల్వలు పడిపోవటంతో ఔషధాలు, ఇంధనం, ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకోలేని దుస్థితిలో శ్రీలంక ఉంది. ఇదంతా కూడా ప్రజల్లో ఆగ్రహజ్వాలల్ని పెంచింది. ''గోట గో హోం'' అంటూ నిరసనకారులు అధ్యక్షుడి భవనాన్ని చుట్టుముట్టారు. రహస్య బంకర్ ద్వారా గొటబయ వేరే చోటకు పారిపోయాడని వార్తలు వెలువడుతున్నాయి.