Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంక అధ్యక్ష బరిలో ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస
- 20న నూతన అధ్యక్షుడి ఎన్నిక !
శ్రీలంక : తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక నిరసనల హోరుతో రగులుతోంది. అధ్యక్ష, ప్రధాని ఇద్దరూ తప్పుకోవాల్సిందేనంటూ నిరసనకారులు ఇప్పటికే అధికారిక నివాసాలను ముట్టడించారు. అధికారిక భవనాలు నిరసనకారుల అధీనంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ... శ్రీలంక పాలన బాధ్యతలు చేపట్టేందుకు రాజకీయ నాయకులు జంకుతున్నారు. ఇప్పటికే శ్రీలంక ద్రవ్యోల్బణం జూన్ నాటికి 55 శాతానికి చేరింది. సంక్షోభ సమయంలో శ్రీలంక పాలనా పగ్గాలను చేబట్టేందుకు..ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస ముందుకొచ్చారు. ఆయన ఆంగ్ల పత్రిక బీబీసీతో మాట్లాడుతూ ... గొటబాయ రాజపక్సా అధికారం నుంచి దిగిన వెంటనే అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని చెప్పారు. ఆయన పార్టీ సమగి జన బలవెగయ (ఎస్జేబీ) ఇప్పటికే ఇతర పక్షాలతో ఈ అంశంపై చర్చలు జరిపింది.
ఒక వేళ అధ్యక్ష స్థానానికి ఖాళీ ఏర్పడితే తాను నామినేషన్ వేసేందుకు సిద్ధమని సజిత్ ప్రకటించారు. ఇప్పటికే ఈ అంశంపై పార్టీలో, మిత్రపక్షాలతో చర్చించామని తెలిపారు. తాము ప్రజలను మోసం చేయడానికి గద్దెనెక్కబోమని..శ్రీలంకను ఈ సంక్షోభం నుంచి బయటపడేయటానికి అనుకున్న ప్రణాళికను ముక్కుసూటిగా అమలు చేస్తామని చెప్పారు. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస 2019లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా అధ్యక్ష పీఠం ఎక్కాలంటే అధికార పార్టీ ఎంపీల మద్దతు కూడా అవసరం. ఇప్పటికే రాజపక్సే కుటుంబంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం సజిత్కు కలిసి వచ్చే అంశం. ఈ నేపథ్యంలో అన్నిపక్షాలతో కలిసి ఏర్పాటు చేయనున్న తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు అంగీకరించారు.
గొటబాయ రాజీనామా..
వచ్చే వారం పార్లమెంటులో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు స్పీకర్ మహీంద యాపా అబేవర్ధన ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అంతకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీ నేతలు కలిసి తీసుకున్నారు. బుధవారం గొటబాయ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని రణిల్ విక్రమసింఘె మంగళవారం అధికారికంగా తెలిపారు. రాజపక్స రాజీనామా సమర్పించగానే, అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.
ఈనెల 15 న పార్లమెంటు సమావేశమై.. అధ్యక్ష పదవి ఖాళీని అధికారికంగా ప్రకటిస్తుంది. 19న నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 20న పార్లమెంటులో నూతన అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేస్తే.. గరిష్ఠంగా 30 రోజుల వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా స్పీకర్ కొనసాగవచ్చు. ఆలోపు పార్లమెంటు.. తమ సభ్యుల్లో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి. గొటబాయ పదవీ కాలం మరో రెండేళ్లు మాత్రమే ఉంది. కాబట్టి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు కూడా ఆ రెండేళ్లే.. పదవిలో కొనసాగుతారు.