Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో : సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో మరోసారి ప్రజాగ్రహం పెల్లుబికింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వీడారన్న విషయం తెలుసుకున్న ప్రజలు మండిపడుతున్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వేల సంఖ్యలో నిరసనకారులు కొలంబో వీధుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా ప్రధాని రణిల్ విక్రమసింఘే దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారంతా ప్రధాని ఇంట్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించడంతో..వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు జల ఫిరంగులు, భాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. పరిస్థితులు అదుపుతప్పేలా కనిపించడంతో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. రాజకపక్స వెళ్లిపోవడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఈ ప్రకటన చేశారు.
గొటబాయ బుధవారం రాజీనామా చేయాల్సి ఉండగా, ఈ తెల్లవారుజామున దేశం దాటి మాల్దీవులకు పారిపోయారు. దాంతో శనివారం తర్వాత నిరసనకారులు మరోసారి తమ ఆందోళనలను తీవ్రతరం చేశారు. పార్లమెంట్, ప్రధాని నివాసం వైపు ర్యాలీగా బయలుదేరారు. ప్రధాని కార్యాలయం ముందు భారీఎత్తున నిరసన కారులున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నిరసనకారులు ఆయన నివాస భవనం గోడలు ఎక్కుతున్నట్టు వాటిలో కనిపిస్తోంది. ఆయన అధ్యక్షుడిగా కొనసాగడాన్ని వారు అంగీకరించడం లేదు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకల్లా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పదవిని వీడకపోతే, తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒకవైపు రణిల్ విక్రమసింఘే ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని, అధ్యక్ష పదవిలో కూర్చోవద్దని నిరసనకారులు ఆందోళన చేస్తుంటే, ఆయన్ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ స్పీకర్ మహింద అభయవర్దన నిర్ణయం తీసుకున్నారు.
అరెస్టు నుంచి తప్పించుకునేందుకు!
గొటబయ బుధవారం అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటిస్తారని అందరూ భావించగా, చడీచప్పుడు లేకుండా ఆయన మాల్దీవులోని మాలేకు పరారైనట్టు వైమానికదళ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మాల్దీవుల్లోని వెలానా అంతర్జాతీయ విమానాశ్రయంలో గొటబయ దిగినట్లు తెలుస్తోంది. ఈయన స్వదేశం వీడిన విషయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం కూడా ధ్రువీకరించింది. రాజపక్స అరెస్టు నుంచి తప్పించుకునేందుకు రాజీనామాకు ముందే దేశం దాటాలని విశ్వప్రయత్నాలు చేశారు. బుధవారం తన భార్య, ఇద్దరు అంగరక్షకులతో కలిసి వాయుసేన విమానంలో దేశం వీడారు.
రాజపక్సేలు అత్యంత స్వార్థపరులు : నార్వే దౌత్యవేత్త ఎరిక్ సోల్హైమ్
శ్రీలంక రాజకీయాల్లో అత్యున్నత పదవుల్ని అనుభవించిన రాజపక్సే సోదరులు...అత్యంత సార్థపరులని నార్వే దౌత్యవేత్త ఎరిక్ సోల్హైమ్ అన్నారు. స్వార్థరాజకీయాలకు రాజపక్సేలు నిదర్శనమని, దేశం కోసం ఆలోంచించే వారు కాదని చెప్పారు. 14ఏండ్ల క్రితం ఎల్టీల్టీఈ, శ్రీలంక ప్రభుత్వానికి మధ్య శాంతిచర్చల్లో మధ్యవర్తిగా సోల్హైమ్ పాల్గొన్నారు. తమిళ్ టైగర్స్, సింహళీయులకు మధ్య సయోధ్య కుదర్చడానికి 50సార్లకుపైగా ఆయన శ్రీలంకలో పర్యటించారు. ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న సంక్షోభంపై మీడియాతో మాట్లాడుతూ, కొత్త అధ్యక్షుడు వచ్చాక శ్రీలంకలో పరిస్థితులు మెరుగుపడే అవకాశముందన్నారు. ఎల్టీల్టీఈని పూర్తిగా తుదముట్టాంచాక...దేశంలోని సింహళీయులంతా రాజపక్సేలకు సంపూర్ణ మద్దతు పలికారని, అయితే ప్రజలిచ్చిన అధికారాన్ని రాజపక్సేలు దుర్వినియోగం చేశారని చెప్పారు.