Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాధారణ టీకాలకు నోచుకోని పిల్లలు
- ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది : యూఎన్ అధ్యయనం
- ఇది బాలలపై తీవ్ర ప్రభావం చూపుతుంది : ఆరోగ్య నిపుణుల ఆందోళన
న్యూయార్క్ :కరోనా మహమ్మారి ఆరోగ్య సంరక్షణకు అంతరాయం కలిగించినందున ప్రపంచ వ్యాప్తంగా గతేడాది 2.5 కోట్ల మంది చిన్నారులు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించే సాధారణ టీకాలు పొందటంలో విఫలమయ్యారు. యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 177 దేశాల జాతీయ ఆరోగ్య సేవల డేటాను ఉపయోగిం చి ఈ సంఖ్యలు లెక్కించ బడ్డాయి.
టీకాకు నోచుకోని పిల్లల సంఖ్య 2020 ఏడాదితో పోలిస్తే 20 లక్షలు అధికంగా ఉన్నది. కరోనా మహమ్మారికి ముందు ఏడాది 2019తో పోలిస్తే ఇది 60 లక్షలు ఎక్కువగా ఉండటం గమనార్హం. '' ఇది పిల్లల ఆరోగ్యానికి రెడ్ అలర్ట్. ఒక తరంలో బాల్య నిరోధక టీకాలలో అతిపెద్ద తగ్గుదల ను మనం చూస్తున్నాం. దాని పర్యవసానాలు వారి జీవితాలపై ఉంటాయి'' అని యూనిసెఫ్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ కేథరీన్ రస్సెల్స్ వివరించారు.
మహమ్మారి ఏడాది 2020 తర్వాత 2021లో పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని ఆశించినప్పటి కీ.. పరిస్థితి మరింతగా దిగజారటం గమనార్హం. కోవిడ్ ఇమ్యునకైజేషన్ కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టిపెట్టడం, అలాగే, ఆర్థిక మందగమనం, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై ఒత్తిడితో సాధారణ టీకా ప్రయత్నాలు మందగిం చాయని యూనిసెఫ్ వివరించింది. ఇది పిల్లల్లో ఆరోగ్య సంక్షోభమని యూనిసెఫ్ సీనియర్ ఇమ్యునైజేషన్ స్పెషలిస్టు నిక్లాస్ డేనిల్సన్ అన్నారు.
ఈ 'చారిత్రక వెనుకబాటుతనం' ఆందోళన కలిగిస్తున్నదని నిపుణులు చెప్పారు. తీవ్రమైన పోషకాహార లోపం పెరగటం, పోషకాహార లోపం ఉన్న పిల్లలు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలను కలిగి ఉంటారని తెలిపారు. మీజిల్స్ వంటి ఇన్ఫెక్షన్లు తరచూ వారికి ప్రాణాంతకంగా మారుతాయని హెచ్చరించారు.
ఎలాంటి టీకాలూ తీసుకోని 'జీరో-డోస్' పిల్లల సంఖ్య 2019-2021 మధ్య 37 శాతం పెరగింది. తక్కువ మధ్య ఆదాయ దేశాల్లో ఈ సంఖ్య 1.3 కోట్ల నుంచి 1.8 కోట్లకు చేరటం గమనార్హం. ఈ విషయంలో ప్రపంచదేశాలు ప్రత్యేక దృష్టిని సారించి రాబోయే తరానికి ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా చూడాల్సినవసరమున్నదని ఆరోగ్య నిపుణులు సూచించారు.