Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటింగ్ ద్వారా ఎన్నుకోవాలని శ్రీలంక పార్లమెంట్ నిర్ణయం
- పారదర్శక పాలన అందిస్తా : సజిత్ ప్రేమదాస
- స్పీకర్ అబేయవర్దేనాను కలిసిన భారత హైకమిషనర్
కొలంబో : రాజకీయం సంక్షోభానికి ముగింపు పలికే దిశగా శ్రీలంకలో వివిధ రాజకీయ పక్షాలు అడుగులు వేస్తున్నాయి. అధ్యక్ష పదవికి గొటబయ రాజీనామాతో..నిరసనకారులు కొంతమేరకు శాంతించారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిమిత్తం శ్రీలంక పార్లమెంట్ శనివారం సమావేశమైంది. ఓటింగ్ ద్వారా అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేయాలని పార్లమెంట్ నిర్ణయించింది. పార్లమెంట్ కార్యదర్శి దస్సనాయకే గొటబయ రాజీనామా లేఖను సభ్యులందరికీ చదివి వినిపించారు. ఈనెల 20న అధ్యక్ష స్థానానికి ఎన్నిక జరగనుందని స్పీకర్ వెల్లడించినట్టు ఓ వార్త సంస్థ తెలిపింది. మంగళవారం నుంచి అధ్యక్ష పదవికి నామినేషన్లు స్వీకరించనున్నారు. ప్రజాతీర్పు ద్వారా కాకుండా పార్లమెంటు సభ్యులు శ్రీలంక అధ్యక్షుడ్ని ఎన్నుకోవాల్సి రావటం 1978 తర్వాత ఇదే ప్రథమం. రహస్య ఓటింగ్ విధానంలో ఎంపీలు వచ్చే బుధవారం తమ దేశాధినేతను ఎన్నుకోబోతున్నారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు నవంబరు, 2024 వరకు పదవిలో ఉంటారు. ఇదిలా ఉండగా, భారత హైకమిషర్ గోపాల్ బాగ్లే శనివారం పార్లమెంట్ స్పీకర్ అబేయవర్దేనాను కలిశారు. సంక్షోభ సమయాన శ్రీలంక పార్లమెంట్ పోషించిన పాత్రను బాగ్లే కొనియాడారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షించటంలో పార్లమెంట్ కీలకపాత్ర వహించిందన్నారు. శాంతియుత పద్ధతిలో అధికార మార్పిడి జరగాలని ఐక్యరాజ్యసమితి శ్రీలంకలోని అన్ని రాజకీయ పక్షాలను కోరింది. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక సంక్షోభానికి మూలం ఎక్కడుందో కనుగొనాలని, ప్రజల కష్టాలను, బాధలను తీర్చాలని సూచించింది. తాత్కాలిక అధ్యక్ష పదవిని చేపట్టిన రణిల్ విక్రమసింఘే, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 'జాతీయ ఇంధన పాస్' విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇకపై రేషన్ పద్ధతిలో వాహనదారులకు వారానికి ఒకమారు పెట్రోల్, డీజిల్ అందజేస్తామని ప్రధాని వెల్లడించారు. కాగా, దేశంలోనే ఉన్న గొటబయ సోదరులు మహింద, బసిల్కు కోర్టులో చుక్కెదురైంది. వారు దేశం విడిచివెళ్లకుండా నిషేధం విధించింది. బసిల్ రాజపక్స గత సోమవారం రాత్రి విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నించారు. మాజీ ప్రధాని మహింద రాజపక్స, మారీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్స ఈనెల 28 వరకు దేశాన్ని వీడి వెళ్లరాదని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది.
జవాబుదారీతనం వహిస్తా : సజిత్ ప్రేమదాస
పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం 'సమగి జన బలవేగయ' (ఎస్జేబీ) అధినేత సజిత్ ప్రేమదాస పేరు అధ్యక్ష పదవికి బాగా వినిపిస్తోంది. ఆయన నేతృత్వంలో ఎస్జేబీ 2020 పార్లమెంట్ ఎన్నికల్లో 54స్థానాలు గెలుచుకుంది. త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలో ప్రేమదాస పోటీ పడుతున్నారు. అసోసియేటెడ్ ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..''ఒకవేళ అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే దేశానికి పారదర్శకమైన పాలన అందిస్తా. ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం తీసుకొస్తా. ఎన్నికల నియంతృత్వానికి స్థానమివ్వను'' అని చెప్పారు.