Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తైవాన్‌పై బైడెన్‌ను హెచ్చరించిన జిన్‌పింగ్
వాషింగ్టన్ : తైవాన్ విషయంలో నిప్పుతో చెలగాటం వద్దని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను హెచ్చరించారు. గురువారం ఇరువురు నేతలు ఫోన్లో మాట్లాడుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ వీడియో భేటీలో జిన్‌పింగ్ మాట్లాడుతూ, నిప్పుతో చెలగాటమాడాలనుకునేవారు చివరికి దాని వేడికే బూడిదై పోతారని బైడెన్‌ను ప్రస్తావిస్తూ హెచ్చరించినట్టు జిన్హువా వార్తాసంస్థ తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా పూర్తిగా అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. తైవాన్ విషయంలో రెండు దేశాల మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తైవాన్‌పై చైనా ప్రభుత్వ, ప్రజల వైఖరి స్థిరంగా వుంటుందని జిన్‌పింగ్ స్పష్టం చేశారు. చైనా జాతీయ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకోవాలన్నది 140కోట్ల చైనీయుల ధృడ సంకల్పమని అన్నారు. ఏడాదిన్నర క్రితం బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత జిన్‌పింగ్‌తో ఇప్పటికి ఐదుసార్లు భేటీ అయ్యారు. వాణిజ్య యుద్ధం, తైవాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న అవిశ్వాసాన్ని కప్పిపుచ్చడం కష్టంగా మారుతోంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌లో పర్యటించాలని భావించిన నేపథ్యంలో తాజాగా ఘర్షణ మొదలైంది. వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ, ఇండో పసిఫిక్‌లో చైనా దూకుడుతో కూడిన వ్యవహార శైలి వల్ల చెలరేగిన ఉద్రిక్తతలు ఎజెండాలో ప్రముఖంగా వుంటాయని అన్నారు. అమెరికా అధికారులు తరచుగా తైవాన్‌లో పర్యటిస్తున్నప్పటికీ, పెలోసి పర్యటనే ప్రధానంగా రెచ్చగొట్టే అంశంగా చైనా భావిస్తోంది. అమెరికా అధ్యక్షుడి తర్వాత రెండో స్థానంలో వున్న నేత కావడంతో ఆమె సైనిక, ఆయుధ బలగాలతో ప్రయాణించే అవకాశాలున్నాయి. సైనిక తోడ్పాటు కావాలని పెలోసి కోరినట్లైతే ఆమె భద్రతా, సురక్షితంగా వెళ్ళి రావడానికి ఏది అవసరమో అది చేస్తామని జనరల్ మార్క్ మిల్లే చెప్పారు.