Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తైవాన్ ఊసే లేకుండా పెలోసీ ఆసియా పర్యటన ఖరారు
బీజింగ్ : అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌లో పర్యటన విషయంలో అమెరికా వెనక్కి తగ్గింది. ఈ వారంలో నాలుగు ఆసియా దేశాల్లో పర్యటించనున్నట్లు పెలోసీ ఆదివారం ధ్రువీకరించారు. అందులో తైవాన్ ఊసే లేదు. తైవాన్‌లో పెలోసి పర్యటించే అవకాశం వుందని వార్తలు వస్తున్నప్పటి నుంచి చైనా తీవ్రంగా స్పందించింది. ఈ పర్యటన జరిగితే తీవ్ర పర్యవసానాలు తప్పవని హెచ్చరించింది. గురువారం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వాణిజ్యం, కోవిడ్ మహమ్మారి, వాతావరణ మార్పులు, భద్రత, ప్రజాస్వామ్య పాలన వంటి అంశాలపై చర్చించేందుకు సింగపూర్, మలేసియా, దక్షిణ కొరియా, జపాన్లలో పర్యటించే కాంగ్రెస్ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్నట్లు పెలోసి తెలిపారు. ''బైడెన్ నాయకత్వంలో, ఆసియాలో వ్యూహాత్మక కార్యకలాపాలను చేపట్టేందుకు అమెరికా ధృఢంగా కట్టుబడి వుంది. స్వేచ్ఛా, పారదర్శకత కలిగిన ఇండో-పసిఫిక్ ప్రాంతం మన దేశ, ప్రపంచ సంక్షేమానికి చాలా కీలకం.'' అని పెలోసి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.