Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాబూల్‌లో మహిళల నిరసన ర్యాలీ
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. ఆహారం..పని..స్వేచ్ఛ కావాలంటూ నినదించారు. అయితే మహిళా నిరసనకారుల ర్యాలీని తాలిబాన్లు హింసాత్మకంగా అణచివేశారు. శనివారం నాటి ఈ ఘటనపై అంతర్జాతీయ మీడియాలో పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఆఫ్ఘాన్‌లో అధికారం చేజిక్కి ఏడాది సమీపిస్తోన్నవేళ..తాలిబాన్లు మరోసారి మహిళలపై విరుచుకుపడ్డారు. హక్కుల సాధనకు రాజధాని కాబూల్‌లో వారు చేపట్టిన ఓ నిరసనర్యాలీపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. గతేడాది ఆగస్టు 15న తాలిబాన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి మహిళల హక్కులను కాలరాస్తూ..ఆ దేశం రెండు దశాబ్దాల్లో సాధించిన ప్రగతిని అణగదొక్కుతున్నారని అంతర్జాతీయ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ఈనేపథ్యంలో శనివారం కొన్ని వందల మంది మహిళలు ఉద్యోగ హక్కుతోపాటు రాజకీయ భాగస్వామ్యాన్ని డిమాండ్ చేస్తూ కాబూల్‌లోని విద్యాశాఖ భవనం ముందు ప్రదర్శన నిర్వహించారు. 'ఆగస్టు 15 బ్లాక్ డే' అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకొని, ఆహారం, పని, స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు చేశారు. అజ్ఞానంతో విసిగి పోయాం.. న్యాయం కావాలంటూ ర్యాలీ చేపట్టారు. దీంతో తాలిబాన్లు తుపాకులతో గాల్లో కాల్పులు జరుపుతూ వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలోనే సమీపంలోని దుకాణాల్లో తలదాచుకున్న కొంతమంది మహిళా నిరసనకారులను వెంబడించి..దాడులు చేశారు. అక్కడున్న కొంతమంది జర్నలిస్టులపైనా దాడికి దిగారు. తాలిబాన్ల పాలనలో మహిళలపై తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. వీటివల్ల వేలాది మంది బాలికలు సెకండరీ విద్యకు దూరమవుతున్నారని, మహిళలు ఉద్యోగాలు చేయడంపై ఆంక్షలు విధించారని పలు నివేదికలు విడుదలయ్యాయి. ఒంటరిగా దూర ప్రయాణాలు సైతం చేసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో తమ హక్కుల కోసం పలు సందర్భాల్లో అక్కడి మహిళలు నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అనేక నెలల తర్వాత మళ్లీ అక్కడ రాజధాని కాబూల్‌లో మహిళలు పెద్ద సంఖ్యలో నిరసనకు దిగారు.