Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 41మంది సజీవ దహనం
- మరో 14మందికి తీవ్రగాయాలు
కైరో : ఈజిప్టు రాజధాని కైరోలోని ఓ చర్చిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని 41 మంది సజీవ దహనం అయ్యారు. ఇంబాబా ఏరియాలోని అబూ సీఫెన్ చర్చిలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చర్చిలో ఒక్కసారిగా మంటలు చోటు చేసుకున్నాయి. ఈ మంటల్లో చిక్కుకుని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని 30 అంబులెన్స్‌ల్లో హాస్పిటల్స్‌కు తరలించినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నది. ఈ ఘటనలో మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవలి కాలంలో ఈజిప్టులో అగ్ని ప్రమాదాలు తరుచూ సంభవిస్తున్నాయి. వీటి నివారణకు పాలకులు, అధికారులు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కైరోకు సమీపంలోకి ఒక వస్త్ర తయారీ పరిశ్రమలో గతేడాది అగ్ని ప్రమాదం సంభవించి 20మంది మరణించారు. ప్రస్తుత అగ్ని ప్రమాద ఘటనకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
చర్చిలో ఆదివారం ఉదయం 9గంటలకు అగ్ని ప్రమాదం సంభవించిందని, ఎయిర్ కండీషనర్లో చెలరేగిన మంటలు అగ్ని ప్రమాదానికి కారణం కావొచ్చునని హోంశాఖ తెలిపింది. అగ్ని ప్రమాద ఘటనపై ఈజిప్టు చీఫ్ ప్రాసిక్యూటర్ విచారణకు ఆదేశించారు. దట్టమైన పొగ అక్కడున్నవారిని చుట్టుముట్టిందని, దాంతో అనేకమంది శ్వాసతీసుకోలేక మరణించి ఉంటారని స్థానిక వైద్యులు అంచనావేస్తున్నారు. పోలీసులు మీడియాకు విడుదల చేసిన ప్రకటన ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చునని తెలుస్తోంది. దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతే ఇల్ సిస్సీ ఫోన్లో కోప్టిక్ చర్చి పోప్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. మృతి చెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ''ప్రమాద ఘటన తెలియగానే, సంబంధిత అధికార వర్గాలతో మాట్లాడాను. బాధితులను రక్షించాల్సిందిగా రాష్ట్ర ఏజెన్సీలకు, ఇతర విభాగాలకు ఆదేశాలిచ్చాను'' అని ఆరోగ్యమంత్రి ఫేస్బుక్లో తెలిపారు.