Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైడెన్‌కు అమెరికన్ ప్రముఖుల బహిరంగ లేఖ
వాషింగ్టన్: అమెరికా రాజకీయ నాయకులు, మేధావులు, శాస్త్రవేత్తలు, మతాధిపతులు, కళాకారులు, సంగీతకారులు, నాయకులు, హక్కుల కార్యకర్తలు తదితర ప్రముఖులతో కూడిన బృందం క్యూబాపై ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఈ బృందం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఒక బహిరంగ లేఖ రాసింది. మాంతాంజాస్ సూపర్ ట్యాంకర్ బేస్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం నుంచి కోలుకుంటున్న ఈ కష్ట కాలంలో క్యూబాపై ఆంక్షలకు స్వస్తి పలకాలని వారు ఆ లేఖలో కోరారు. ట్రంప్ హయాంలో తీసుకొచ్చిన క్రూరమైన విధానాలు క్యూబా ప్రజలను తీవ్ర కడగండ్ల పాల్జేశాయని, బైడెన్ ప్రభుత్వం ఆ విధానాలను తిరస్కరించాలని అత్యవసర విజ్ఞప్తి చేస్తున్నామని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. అమెరికా ఆంక్షలు క్యూబాలో చెలరేగుతున్న మంటలకు ఆజ్యం పోశాయి! విపత్తు సహాయం అందించడానికి అమెరికన్ సంస్థలను, సంఘాలను క్యూబా చట్టం అనుమతిస్తుందని హవానాలోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ట్రంప్ విధించిన 243 ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. క్యూబాకు అత్యవసర సాయాన్ని అందకుండా ఈ అంక్షలు అడ్డుపడుతున్నాయి. మంచి పొరుగు దేశమైన క్యూబా ప్రస్తుత విషాద ఘటన నుంచి కోలుకోకుండా అడుపడుతున్న ఆ 243 ఆంక్షలను వెంటనే ఎత్తివేయడం వల్ల అమెరికాకు వచ్చే నష్టమేమీ లేదని పేర్కొంది.
పొరుగువారి ఇల్లు తగలబడుతున్నప్పుడు అక్కడికి పరుగెత్తుకుని వెళ్లి ప్రాణాలను రక్షించడం. మంటలను ఆర్పడం వంటివి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ చేసే పని. క్యూబా మన పొరుగు దేశం.! ముఖ్యంగా ఒక విషాదకరమైన సమయంలో ఉన్న ఆ దేశానికి అండగా నిలవడం మన కనీస బాధ్యత. ఆ దేశానికి అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల నుంచి సాయం అందేలా చూడాలే తప్ప దానిని ఆంక్షల పేరుతో అడ్డుకోవడం దారుణం. ఆహారం, మందులు వంటివి కొనుగోలు చేసేందుకు క్యూబాకు డాలర్లు అవసరం, వాటిని అడ్డుకోవద్దు అని వారు ఆ లేఖలో కోరారు.
బైడెన్ ప్రభుత్వం సాంకేతిక సలహా ఇచ్చి చేతులు దులిపేసుకుంటే చాలదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితా నుంచి క్యూబాను తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో రోజర్ వాటర్స్, కార్నెల్ వెస్ట్, జుడిత్ బట్లర్, నోమ్ చోమ్స్కీ, రోక్సాన్ డన్బార్-ఓర్టిజ్, జెరెమీ కార్బిన్, రెవరెండ్ లిజ్ థియోహారిస్, సియాన్్ కుటీ, విజరు ప్రసాద్, గెయిల్ వాకర్, బ్రియాన్ బెకర్, సిండి వీస్నర్, క్లాడియా డి లా క్రజ్, డేవిడ్ అడ్లెర్, డేవిడ్ హార్వే, గాబ్రియేల్ రాక్‌హిల్, గెరాల్డ్ హార్న్, గినా బెలాఫోంటే, హెలెన్ యాఫీ, జెన్నిఫర్ పోన్స్ డి లియోన్, జెరెమీ కార్బిన్, జియా హాంగ్, జోడీ ఎవాన్స్, జుడిత్ బట్లర్, మనోలో డి లాస్ శాంటోస్, మను కరుక, ఫిలిప్ ఎ. రాబిన్, కెల్లీ, రూత్ విల్సన్ గిల్మోర్, సాల్వటోర్ ఎంగెల్-డి మౌరో, సీన్ కుటీ, యాసెమిన్ జహ్రా తదితరులు ఉన్నారు.