Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్లో రైల్వే సమ్మె
- తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి
- వేతనాలు పెంచాలని కార్మికుల డిమాండ్
- ఎక్కడికక్కడ నిలిచిన రాకపోకలు
లండన్ : బ్రిటన్లో రైల్వే కార్మికులు, ఉద్యోగులు నిరసనబాట పట్టారు. గురువారం ప్రారంభమైన దేశవ్యాప్త సమ్మె వారాంతం వరకు కొనసాగిస్తామని రైల్వే కార్మికులు, ఉద్యోగ సంఘాలు శనివారం ప్రకటించాయి. వేతనాల పెంపు, పని నిబంధనలపై ప్రభుత్వ ప్రకటన విడుదలైన మరుసటి రోజే, బ్రిటన్ ప్రభుత్వతీరును నిరసిస్తూ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. అధిక ధరలు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని వేతనాలు పెంచాలని, కరోనా సంక్షోభ సమయంలో తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం, రైల్వే కంపెనీలతో జరిగిన చర్చలు విఫలం కావటంతో లండన్లోని సబ్వే నెట్వర్క్ గురువారం సమ్మెకు దిగాయి. ఆర్ఎంటీ, టీఎస్ఎస్ఏ, యునైట్ యూనియన్ మెంబర్స్ కూడా సమ్మెలోకి వచ్చాయి. అధిక ధరలు, ద్రవ్యోల్బణం తాకిడితో వివిధ రంగాల్లో, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు విలవిల్లాడుతున్నారు. రోజువారీ ఖర్చులకు సరిపడా ఆదాయాలు ఉండటం లేదని ఆందోళన చెందుతు న్నారు. రైల్వే, పోస్టల్, ఓడరేవుల్లో పనిచేసే కార్మికు లు, హాస్పిటల్స్లో నర్సులు..వివిధ రంగాల్లో ఉద్యో గులు ఆందోళనబాట పడుతున్నారు. ఇంగ్లాండ్, వేల్స్ న్యాయవాదులు వాకౌట్లు చేస్తున్నారు. ఆగస్టు 26 నుంచి వరుస సమ్మెను చేపడుతున్నామని పోస్టల్ ఉద్యోగులు ప్రకటించారు. నర్సులు సమ్మె ఓటు వేయాలని యోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో వివిధ రంగాల్లో నిరసనలు మరింత ఉధృతమయ్యే అవకాశముందని సమాచారం.
అధిక ధరలు, ద్రవ్యోల్బణం దెబ్బ
ఉద్యోగ భద్రత, వేతనాలు పెంపు, పని నిబంధనలపై ప్రభుత్వ ప్రకటన కార్మికులు, ఉద్యోగాల్లో ఆగ్రహం పెంచింది. తొలుత లండన్ సబ్వే నెట్వర్క్ గురువారం సమ్మెలోకి దిగగానే, మిగతా కార్మిక సంఘాలు సైతం ఆందోళనబాట పట్టాయి. శని, ఆదివారం దేశవ్యాప్తంగా సమ్మెను చేపడుతున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. శనివారం రైల్వే నెట్వర్క్లో 20శాతం మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంది. ద్రవ్యోల్బణం, అధిక ధరల తాకిడితో బ్రిటన్లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరటంతో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. రాబో యే నెలల్లో ధరల పెరుగుదల 13శాతంపైగా ఉంటుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంచనావేసింది. మరోవైపు కార్మికులు, ఉద్యోగుల వాస్తవ వేతనాలు గణనీయంగా పడిపోతూ వస్తున్నాయి. రోజువారీ జీవన వ్యయం భారీగా పెరగటంతో వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. వేతనాల పెంపు కోసం నిరసనబాట పడుతున్నారు. కోవిడ్ సంక్షోభం, అటు తర్వాత రైల్వేల ఆదాయం గణనీయంగా తగ్గింది. నష్టాల్ని పూడ్చుకోవడానికి రైల్వే కంపెనీలు కార్మికులు, ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నాయి. వేతనాల వ్యయాన్ని తగ్గించుకోవాలని బ్రిటన్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది.