Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యరాజ్య సమితి, పాక్ ప్రభుత్వం విజ్ఞప్తి
ఇస్లామాబాద్ : వరదల విలయతాండవంతో గత కొద్ది వారాలుగా అతలాకుతలమవుతున్న పాకిస్తాన్కు సాయపడేందుకు నిధులను అందించాల్సిందిగా కోరుతూ ఐక్యరాజ్య సమితి, పాకిస్తాన్ ప్రభుత్వం మంగళవారం ఫ్లాష్ అప్పీల్ చేశాయి. వరద బాధితుల సహాయార్ధం తక్షణమే 16కోట్ల డాలర్ల మేరకు నిధులు కావాలని విజ్ఞప్తి చేశాయి. ఇప్పటివరకు ఈ వరదల్లో 1136 మంది మరణించగా, గత 24 గంటల్లో 75మంది చనిపోయారు. 59మంది గాయపడ్డారు. మొత్తంగా 3.3కోట్ల మంది ఈ వరదలకు దెబ్బతిన్నారు. పెద్ద సంఖ్యలో మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. పంటలకు కూడా దారుణంగా నష్టం వాటిల్లింది. ఈ నిధులతో 52లక్షల మందికి ఆహారం, నీరు, పారిశుధ్యం, అత్యవసర సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి చర్యలు చేపట్టనున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ వీడియో ప్రకటనలో తెలిపారు. వరద బీభత్సాన్ని భారీ సంక్షోభంగా అభివర్ణించారు. సింథ్ రాష్ట్రం అన్నింటికంటే బాగా దెబ్బతింది. మొత్తంగా 35,500కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. రాగల 24గంటల్లో కాబూల్, సింథ్ నదులకు మరింతగా వరదలు వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయిందని, గ్రౌండ్ జీరోకి మారిందని ఆర్థిక మంత్రి బిల్వాల్ వ్యాఖ్యానించారు. మొత్తంగా అన్నీ పునరుద్ధరించడానికి కనీసం ఐదేళ్లు పడుతుందని అంచనా వేశారు. వరద బాధితుల కోసం సాయమందించేందుకు కెనడా, అజర్బైజాన్, బ్రిటన్లు ముందుకొచ్చాయి. వరుసగా 50లక్షల డాలర్లు, 12 లక్షల డాలర్లు, 15 లక్షల పౌండ్లు అందజేయనున్నట్లు ప్రకటించాయి.