Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాచరికపు బృహత్తర బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని హామీ
లండన్ : ఎలిజబెత్-2 పెద్ద కుమారుడు, యువరాజు చార్లెస్ బ్రిటన్ కొత్త రాజుగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం కన్నుమూసిన మహారాణి ఎలిజబెత్ తర్వాత ఆమె కుమారుడే రాజు అయినప్పటికీ శతాబ్దాల నాటి సాంప్రదాయం ప్రకారం శనివారం సెంట్రల్ లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో యాక్సెషన్ కౌన్సిల్ సమావేశమై చార్లెస్-3ని రాజుగా ప్రకటిస్తూ రాచరికపు అధికారాలను కట్టబెట్టింది. ఈ కౌన్సిల్లో సీనియర్ బ్రిటీష్ రాయల్స్, రాజకీయ, మతపెద్దలు వుంటారు. రాజుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చార్లెస్ మాట్లాడుతూ, తన విధులు, కర్తవ్యాలు, బృహత్తరమైన వారసత్వం, రాచరికపు బాధ్యతల గురించి తనకు బాగా తెలుసునని అన్నారు. తన తల్లి మృతితో తనతో పాటు యావత్ దేశం ఎంత విషాదంలో మునిగిపోయిందో తెలుస్తోందని, కోలుకోలేని ఈ నష్టాన్ని మనందరం సమిష్టిగా ఎదుర్కొనాల్సి వుందని అన్నారు. ఈ కష్టకాలంలో తన కుటుంబానికి అన్ని వైపుల నుండి సానుభూతి, ప్రేమ అందుతోందని, అందుకు తాను కృతజ్ఞుడినని చెప్పుకున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని లిజ్ ట్రస్‌తో సహా వందల సంఖ్యలోని కౌన్సిలర్లు, భార్య కెమెల్లా, పెద్ద కుమారుడు విలియం హాజరయ్యారు. తన తల్లి ఎలిజబెత్ జీవితాంతం ప్రేమ, నిస్వార్ధమైన సేవలకు ఒక ఉదాహరణగా నిలిచారని చార్లెస్ వ్యాఖ్యానించారు. వాటిని తాను కూడా అనుసరిస్తానని హామీ ఇచ్చారు. ''ప్రజల సార్వభౌమాధికారిగా వారి ప్రేమ, విధేయతలు నాకెప్పుడూ వుంటాయని, వాటిని కాపాడుకుంటానని'' పేర్కొన్నారు. తాజాగా తనకు సంక్రమించిన, తనపై వుంచిన ఈ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. తన సతీమణి మద్దతు తనకెల్లప్పుడూ వుంటుందన్నారు. ఇక్కడ సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగిన యాక్సెషన్ కౌన్సిల్ సమావేశం రెండు భాగాలుగా జరిగింది. మొదట కౌన్సిల్ సమావేశమైన వెంటనే కౌన్సిల్ క్లర్క్ మాట్లాడుతూ, ''యువరాజు చార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జి ఇప్పుడు రాజు చార్లెస్-3 అయ్యారు.'' అని ప్రకటించారు. కౌన్సిలర్లు అందరూ దాన్ని సమర్ధించారు. అనంతరం ప్యాలెస్ బాల్కనీ నుండి చార్లెస్ రాజైన విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు.