Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధ్రువీకరించిన రష్యా రక్షణ మంత్రిత్వశాఖ
మాస్కో : ఉక్రెయిన్లోని ఖర్కోవ్ ప్రాంతంలో పలు చోట్ల నుండి సైనిక బలగాలు వైదొలగడాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో ఈ పరిణామం సంభవించింది. ''ప్రత్యేక సైనిక చర్య లక్ష్యాలను సాధించడానికి గానూ, బలక్లేయా, ఇజియం ప్రాంతాల్లో బలగాలను తిరిగి సమూహపరచాలని నిర్ణయించాం. డాంటెస్క్ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసే క్రమంలో ఇదొక నిర్ణయం.''అని రష్యా సైన్యం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రాంతంలోని బలగాలను గత మూడు రోజులుగా డాంటెస్క్ పీపుల్స్ రిపబ్లిక్ భూభాగంలోకి మోహరిస్తున్నామని రక్షణ శాఖ తెలిపింది. ఆపరేషన్ సందర్భంగా మిలటరీ అనేక చర్యలను చేపట్టిందని పేర్కొంది. అంతకుమించి ఈ చర్యల వివరాలను వెల్లడించలేదు. రష్యా బలగాలకు నష్టాన్ని నివారించేందుకు గానూ ఈ ప్రాంతంలోని ఉక్రెయిన్ సైనిక యూనిట్లపై అత్యంత శక్తివంతమైన శతఘ్ని, క్షిపణి, విమాన దాడులకు పాల్పడుతోందని రష్యా రక్షణ శాఖ పేర్కొంది. ఇప్పటికి వందకు పైగా కవచాలను, ఫిరంగులను ధ్వంసం చేశామని, గత మూడు రోజుల్లో 2వేల మందికి పైగా ఉక్రెయిన్, విదేశీ సైనికులను మట్టుపెట్టామని తెలిపింది. గురువారం ఖర్కోవ్ ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాలు పెద్ద ఎత్తున దాడికి దిగిన నేపథ్యంలో ఈ ఉపసంహరణ జరిగింది. అంతకుముందు రష్యా అదుపులో గల దక్షిణ ఉక్రెయిన్ నగరమైన ఖెర్సాన్కు సమీపంలో ఇతర చోట్ల రష్యా బలగాలు ముందుకు చొచ్చుకుపోవడానికి ప్రయత్నాలు జరిగాయి.