Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రాన్స్‌లో న్యాయ విచారణకు అడ్డంకులు : మీడియాపార్ట్ కథనం
పారిస్ : రాఫెల్ కుంభకోణంలో అవినీతి, అక్రమాలపై ఫ్రాన్స్‌లో జరుగుతున్న న్యాయ విచారణకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. విచారణ అధికారులు, జడ్జీలు అడిగిన పత్రాలను ఫ్రాన్స్ మిలటరీ, విదేశాంగ అధికారులు ఇవ్వటం లేదని, తద్వారా విచారణకు అనేక అడ్డంకులు ఏర్పడ్డాయని ఫ్రాన్స్‌కు చెందిన ఆన్లైన్ న్యూస్ పేపర్ 'మీడియాపార్ట్' తాజాగా వార్తా కథనం వెలువరించింది. ఫ్రాన్స్ డిఫెన్స్, ఏవియేషన్ గ్రూప్ ప్రధాన కార్యాలయాల్లో న్యాయమూర్తులు, విచారణ అధికారులు నాలుగు నెలలపాటు సోదాలు నిర్వహిస్తున్నారు. రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంలో కీలక పత్రాలు, ఆర్థిక సమాచారం ఫ్రాన్స్ మిలటరీ, విదేశాంగ శాఖ వద్ద ఉన్నాయి. వీటిని 'అత్యంత గోప్యత'తో కూడిన పత్రాలుగా ఆ శాఖలు వర్గీకరించాయి. 'మిలటరీ రహస్య'మని ఈ పత్రాల్ని విచారణ అధికారులకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల తయారుదారు 'డస్సాల్ట్ ఏవియేషన్' ప్రధాన కార్యాలయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో సోదాలు జరిగాయి. జూన్‌లో విచారణ అధికారులు ఫ్రాన్స్ మిలటరీ, విదేశాంగ కార్యాలయాలకు వెళ్లారు. ఒప్పందానికి సంబంధించిన అధికారిక పత్రాలు ఇవ్వాల్సిందిగా కోరారు. న్యాయ విచారణ ప్రస్తుతం ఇక్కడ ఆగిపోయింది. యూపీఏ-2 చేసుకున్న రాఫెల్ ఒప్పందంలో మోడీ సర్కార్ 2015లో అనేక మార్పులు చేసింది. మొదట కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్‌కు ఫ్రాన్స్ 126 రాఫెల్ యుద్ధ విమానాలు ఇవ్వాలి. దీనిని 36కు తగ్గించి సుమారుగా రూ.62వేల కోట్లతో ప్రధాని మోడీ పారిస్ వెళ్లి స్వయంగా ఒప్పందం కుదుర్చుకొని వచ్చారు. కొత్త ఒప్పందానికి 2016లో కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఒప్పందంలో రిలయన్స్ అనిల్ అంబానీకి భాగస్వామ్యం కల్పించారు. వేల కోట్ల విలువ జేసే కాంట్రాక్ట్ ఇప్పించారు. ప్రభుత్వ రంగ సంస్థ 'హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్'ను ఒప్పందం నుంచి తప్పించటం చర్చనీయాంశమైంది. ఒక్కో యుద్ధ విమానం ధర 41శాతం పెంపునకు మోడీ సర్కార్ ఆమోదం తెలపటం వివాదాస్పదమైంది. ఈ ఒప్పందం కోసం డస్సాల్ట్ ఏవియేషన్ పెద్ద మొత్తంలో ఆర్థిక అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు వెలువడ్డాయి. దీనికి సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని పరిశోధనాత్మక వార్తా కథనాలు సైతం వెలువడ్డాయి.