Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ పిలుపు
- 77వ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఐక్యరాజ్య సమితి : ఉమ్మడి సవాళ్ళను ఎదుర్కొనేందుకు సభ్య దేశాలు సంఘీభావంతో వ్యవహరించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ పిలుపిచ్చారు. మంగళవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 77వ సమావేశాలు ప్రారంభమయ్యాయని జనరల్ అసెంబ్లీ అధ్యక్షులు కసాబా కొరొసి ప్రకటించారు. కొత్త సమావేశాలు ప్రారంభమైనా గత సమావేశాల్లో పేర్కొన్న అనేక సవాళ్ళు ఇంకా అపరిష్కృతంగానే వున్నాయని గుటెరస్ పేర్కొన్నారు. ఘర్షణలు, వాతావరణ మార్పు, చిన్నాభిన్నమైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, దారిద్య్రం, అసమానతలు, ఆకలి, అవిశ్వాసం వంటి పరిస్థితుల నుండి శాంతి, మానవ హక్కులు, సుస్థిర అభివృద్ధి దిశగా మనం ముందుకు సాగాల్సిన పరిస్థితుల్లో సంక్షోభంతో నిండిన ప్రపంచంలో మనం వున్నామని గుటెరస్ పేర్కొన్నారు. ఈ ఉమ్మడి సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మనమంతా సంఘీభావంగా వ్యవహరించాల్సి వుందని, ఈ క్రమంలో ఈ సంస్థ యొక్క పూర్తి సామర్ధ్యాన్ని ప్రదర్శించాల్సి వుందని అన్నారు. ఐక్యరాజ్య సమితి అంటేనే సహకారానికి కేంద్ర బిందువు. అందులో జనరల్ అసెంబ్లీ అనేది జీవనాడి వంటిది. ఈ సంస్థ దేనికైతే ప్రాతినిధ్యం వహిస్తోందో ఆ బహుళపక్ష వ్యవస్థ పటిష్టతకు, శాశ్వతత్వానికి రాబోయే రోజులు పరీక్షగా నిలుస్తాయని ప్రతినిధులను ఉద్దేశించి గుటెరస్ పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ఈ మూడు సమర్ధవంతమైన సాధనాలను ఉపయోగించుకుని సమస్యలకు పరిష్కారాలను, ఏకాభిప్రాయాలను కనుగొనాల్సిన బాధ్యత మన సభ్య దేశాలపై వుందని, యావత్ ప్రపంచం ఈ విషయంలో మన వైపే చూస్తోందని గుటెరస్ పేర్కొన్నారు. మరింత మెరుగైన, శాంతియుతమైన ప్రపంచం దిశగా ఇదే అత్యుత్తమమైన మార్గమని వ్యాఖ్యానించారు.
సంఘీభావం, సుస్థిరత, సైన్స్ ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని జనరల్ అసెంబ్లీ అధ్యక్షులు కొరొసి పిలుపిచ్చారు. మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి ఏకైక మార్గం మనం పరివర్తన చెందడమేనని అన్నారు.