Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్, ఆఫ్ఘన్ పరిస్థితులపై చర్చ ?
- కజకస్తాన్ చేరుకున్న జిన్‌పింగ్
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్) : షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) సదస్సు ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్ లో గురువారం ప్రారంభమ వుతోంది. కోవిడ్ తర్వాత పూర్తి స్థాయిలో జరుగుతున్న మొదటి ముఖాముఖి సమావేశం ఇదే. 2019లో కిర్గిస్తాన్‌లోని బిష్కెక్లో చివరిగా సదస్సు జరిగింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఎస్సిఓ సభ్య దేశాలైన భారత్, చైనా, కజకస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు పరిశీలకురాలి హోదాలో వున్న ఇరాన్ ఈసారి సభ్య దేశంగా చేరుతోంది. మోడీ, పుతిన్, జిన్ పింగ్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసితో సహా మొత్తంగా 15మంది నేతలను సదస్సుకు ఆహ్వానించారు.
షాంఘై సహకార సంస్థను 2001లో రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజికిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లు షాంఘై నగరంలో స్థాపించాయి. ప్రాంతీయ భద్రతా సమస్యలు, అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే ఈ సంస్థలో 2005లో భారత్ పరిశీలకురాలిగా చేరింది. 2017లో పాకిస్తాన్‌తో కలిసి భారత్ సభ్యత్వం పొందింది.
రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితిపై సదస్సులో ప్రధాన చర్చించ నున్నారు. అలాగే ఉక్రెయిన్‌పై దాడి తర్వాత అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షుభిత పరిస్థితులను కూడా చర్చిస్తారని భావిస్తున్నారు. అలాగే తాలిబన్లు పగ్గాలు చేపట్టిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితి కూడా ఎజెండాలో ముఖ్యాంశంగా వుంది. ఈ సదస్సుకు హాజరయ్యే నేతలు పలువురు ఈ సందర్భంగా ముఖా ముఖి సమావేశాలు జరపనున్నారు.
ఎస్సిఓ సదస్సు సందర్భంగా జరిగే పలు సెషన్లలో కనీసం రెండు సెషన్లలో మోడీ, జిన్‌పింగ్‌లు ఒకే రూమ్‌లో వుండనున్నారు. ఈ సంద ర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక సమావేశం జరిపే అవకాశం వుందని భావిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా మోడీ భేటీ అయ్యే అవకాశం వుంది.
జిన్‌పింగ్‌కు సాదర స్వాగతం
కజకస్తాన్‌లో ఒక రోజు అధికార పర్యటన నిమిత్తం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బుధవారం ఇక్కడకు చేరుకున్నారు. ఉజ్బెకిస్తాన్‌లో జరిగే ఎస్సిఓ సదస్సుకు హాజరవుతున్న జిన్‌పింగ్ ఈ సందర్భంగా కజక్, ఉజ్బెక్ అధ్యక్షుల ఆహ్వానం మేరకు ఆయా దేశాల్లో అధికార పర్యటన జరుపుతున్నారు. నూరుల్సుల్తాన్ నజర్బయేవ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జిన్‌పింగ్‌కు సాదర స్వాగతం లభించింది. కజక్ డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి, నగర మేయర్, కజక్‌లో చైనా రాయబారి ఝాంగ్‌తో సహా పలువురు సీనియర్ అధికారులు స్వాగతం పలికిన వారిలో వున్నారు.