Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 145 మందికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
- భయోత్పాతంతో పరుగులు తీసిన ప్రయాణికులు
మస్కట్ : కానేపట్లో బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో పెద్ద ఎత్తున పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఒమన్ రాజధాని మస్కట్ విమానాశ్రయంలో కొచ్చిన్‌కు వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానంలోని ఒక ఇంజనులో టేకాఫ్‌కు కాస్త ముందుగా మంటలు చెలరేగాయి. దాంతో వెంటనే విమానంలోని 145 మంది ప్రయాణికులను, సిబ్బందిని విమానం నుండి దింపి టెర్మినల్ భవనాలకు తరలించారు. వీరిలో నలుగురు శిశువులు కూడా వున్నారు. ఈ సందర్భంగా ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ప్రయాణికులందరినీ తీసుకెళ్లడానికి వేరే విమానాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ మేరకు బుధవారం పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డిజిసిఎ) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ రంగంలో దశాబ్దాల పాటు సేవలందించిన ఎయిర్ ఇండియా సంస్థను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే టాటా గ్రూపునకు కారుచౌకగా అమ్మేసిన సంగతి విదితమే. భారత్‌కి చెందిన మొదటి అంతర్జాతీయ బడ్జెట్ విమానంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు పేరుంది. ప్రధానంగా పశ్చిమాసియా దేశాలు, ఆగేయాసియా దేశాలకు ఇది ప్రయాణిస్తుంటుంది. దేశంలోని విమానయానరంగం మొత్తం ప్రయివేటు సంస్థలే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటీవల ప్రమాదాల ఘటనలు కూడా పెరుగుతున్నాయి. రెండు మాసాల క్రితం కాలికట్ నుండి దుబారుకి వెళ్ళే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో కాలిన వాసన రావడంతో అత్యవసరంగా మాస్కట్కి మళ్ళించారు. జులైలో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించి చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ నుండి వడోదరకి వెళుతున్న ఇండిగో విమానం ఇంజనులో అసాధారణంగా కుదుపులు రావడంతో ముందు జాగ్రత్తగా జైపూర్‌కి మళ్లించారు. షార్జా నుండి హైదరాబాద్‌కి వెళ్లాల్సిన మరో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో కరాచికి మళ్ళించారు. ఢిల్లీ నుండి గువహటి వెళ్ళాల్సిన గో ఫస్ట్ విమానం గాల్లో వుంటుండగానే విమానం పై పొర బీటలు వారడంతో జైపూర్‌కి మళ్ళించారు. రెండు రోజుల్లో ఇలా మూడు సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తన మంత్రిత్వ శాఖ, ఎయిర్‌లైన్స్ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. మరింత మెరుగైన పర్యవేక్షణ వుండేలా చూడాల్సిందిగా కోరారు.