Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డమాస్కస్ ఎయిర్‌పోర్ట్‌పై క్షిపణి దాడి
- ఐదుగురు సైనికులు మృతి
డమాస్కస్ : సిరియాపై ఇజ్రాయిల్ ఒక్కసారిగా విరుచుకుపడింది. సైనిక స్థావరాలతో పాటు రాజధాని డమాస్కస్‌లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయిల్ దాడులకు ఒడిగట్టింది. డమాస్కస్ అంతర్జాతీయ విమానా శ్రయంపైనా, సమీపంలోని మిలటరీ పోస్టులపైనా క్షిపణులు దాడికి పాల్పడింది. ఈ ఘటనల్లో ఐదుగురు సిరియన్ సైనికులు చనిపోయారు. ఈ మేరకు సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ సానా శనివారం తెలిపింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడులు చోటు చేసుకున్నాయి. ప్రాణ నష్టంతో పాటూ ఆస్తి నష్టం కూడా ఎక్కువగానే వుందని ఆ వార్తలు తెలిపాయి. అయితే లక్ష్యాలను చేరుకునే లోపుగా ఇజ్రాయిల్ క్షిపణులను కొన్నింటిని కూల్చివేసినట్లు సానా తెలిపింది. ఈ దాడుల్లో ఐదుగురు సిరియన్ సైనికులతో పాటూ ఇరాన్ మద్దతు గల గ్రూపులకు చెందిన ఇద్దరు సభ్యులు కూడా మరణించారని సిరియా మానవహక్కుల పర్యవేక్షక సంస్థ తెలిపింది. దీనిపై ఇజ్రాయిల్ మిలటరీ వెంటనే స్పందించలేదు. పదిరోజుల క్రితం సిరియాలోని అలెప్పో విమానాశ్రయంపై ఇజ్రాయిల్ దాడులు జరిపింది. ఆ దాడి తీవ్రతకు కొద్ది రోజుల పాటు విమానాశ్రయం మూత పడింది. వారం రోజుల వ్యవధిలో అలెప్పో ఎయిర్‌పోర్ట్‌పై అది రెండవ దాడి. ఆ తర్వాత తాజాగా డమాస్కస్‌పై దాడులు జరిగాయి. అంతకుముందు జూన్ 10న కూడా డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇజ్రాయిల్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో మౌలిక సదుపాయాలు, రన్‌వేలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ప్రధాన రన్‌వే అయితే దేనికీి పనికి రాకుండా పోయింది. మరమ్మత్తులు చేసిన రెండు వారాల తర్వాత మళ్లీ ఎయిర్‌పోర్ట్‌లో కార్య కలాపాలు ప్రారంభమయ్యాయి. ఇటీవలి సంవత్సరాల్లో సిరియాలో ప్రభుత్వ అదుపులో గల ప్రాంతాల్లోని లక్ష్యాలపై ఇజ్రాయిల్ వందలాది దాడులు జరిపింది. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటి వరకు 75 మంది పౌరులు ఇజ్రాయిల్ దాడుల్లో చనిపోయారు. లెబనాన్ హిజ్బుల్లా వంటి ఇరాన్ మద్దతు గల తీవ్రవాద గ్రూపుల స్థావరాలే తమ దాడులకు లక్ష్యాలుగా వుంటాయని ఇజ్రాయిల్ బుకాయిస్తోంది.