Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మండు : పశ్చిమ నేపాల్‌లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కారణంగా కొండ చరియలు విరిగిపడడంతో 17 మంది మరణించారని అధికారులు శనివారం తెలిపారు. సుదూర్ పశ్చిమ్ ప్రావిన్సులోని అచ్చమ్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు జిల్లాలో భారీ నష్టం వాటిల్లినట్లు జిల్లా తాత్కాలిక ముఖ్య అధికారి దీపేష్ రిజాల్ తెలిపారు. కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో గాయపడిన 11 మందిని మెరుగైన చికిత్స కోసం సుర్కెట్ జిల్లాకు విమానంలో తరలించినట్లు చెప్పారు. కాగా మరో ముగ్గురి ఆచూకీ తెలియరాలేదని తెలిపారు. వారి కోసం నేపాల్ పోలీసు సిబ్బంది రంగంలోకి దిగారని, గాలింపు చర్యలు కొనసాగుతు న్నాయని చెప్పారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలిపారు. ప్రావిన్స్‌లోని ఏడు జిల్లాలను కలుపుతున్న భీమ్‌దత్తా హైవే కూడా ఈ ఘటనల్లో దెబ్బతింది. వీటి వల్ల కమ్యూనికేషన్ సంబంధాలకు కూడా ఆటంకం కలిగిందని అధికారులు చెప్పారు. నేపాల్‌లో పర్వత ప్రాంతాల్లో జూన్, సెప్టెంబరు మధ్య కొండచరియలు విరిగిపడడం చాలా ఎక్కువ.