Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, బైడెన్
లండన్ : బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగిన ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. బ్రిటన్, యూరప్‌లోని ఇతర దేశాల నుంచి లక్షలాది మంది రాణి అంత్యక్రియల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బ్రిటన్ పౌరులు ఆమెకు కన్నీటితో వీడ్కోలు పలికారు. రాణి అంత్యక్రియల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతోపాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2వేల మంది ప్రముఖులు పాల్గొన్నారు. బకింగ్‌హం ప్యాలెస్‌లో రాజు చార్లెస్‌ను కలుసుకొని సంతాపం తెలిపారు.
అత్యంత పురాతనమైన వెస్ట్‌మినిస్టర్ అబే చర్చిలో ప్రార్థనల అనంతరం రెండు నిమిషాలపాటు అక్కడ హాజరైనవారు మౌనం పాటించారు. ఈ ఘట్టంతో బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించినట్టే. చర్చి వద్ద జాతీయ గీతాలాపనతో ఎలిజబెత్ అంత్యక్రియల ఘట్టం పూర్తయ్యింది. దీనికంటే కొద్ది నిమిషాల ముందు ప్రార్థనలు జరిగే సమయంలో అక్కడున్న గంటను 96సార్లు మోగించారు. రాణి ఎలిజబెత్ బతికివున్న 96ఏండ్లకు గుర్తుగా అన్నిసార్లు ఈ గంటను మోగించారు. వెస్ట్‌మినిస్టర్ అబే చర్చిలో ప్రార్థనలు పూర్తయిన తర్వాత, విండ్సర్ క్యాసిల్‌లో అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి భౌతిక కాయాన్ని తీసుకెళ్లారు. చివరిగా..సన్నిహితుల సమక్షంలో విండ్సర్ క్యాసిల్‌లో రాణి ఎలిజబెత్‌ను ఖననం చేశారు. గతేడాది కన్నుమూసిన రాజు ఫిలిప్ సమాధాని పక్కనే ఎలిజబెత్‌కు అంత్యక్రియలు నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వేలాదిమంది అతిథులు, లక్షలాది మంది బ్రిటన్ పౌరుల సమక్షంలో రాణి అంతిమయాత్ర అధికారిక లాంఛనాలతో సాగింది. వెస్ట్‌మినిస్టర్ హాల్లోని క్యాటఫాక్‌పై ఉన్న రాణి శవపేటికను విండ్సర్ క్యాసిల్‌కు తీసుకెళ్లే కార్యక్రమం సోమవారం మొదలైంది. ఈక్రమంలో రాణి పార్థీవదేహాన్ని తొలుత వెస్ట్‌మినిస్టర్ అబేకు తీసుకెళ్లారు. అక్కడ దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రముఖల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, నివాళులు అర్పించారు.