Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా విధానాన్ని ఉల్లంఘించే వ్యాఖ్యలివి : చైనా
వాషింగ్టన్, బీజింగ్ : సమయం వచ్చినపుడల్లా తైవాన్ గురించి మాట్లాడుతూ, ఏదో ఒక రకంగా చైనాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ వెనుకంజ వేయడం లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అవసరమైతే, చైనా నుంచి తైవాన్ను కాపాడేందుకు సైనిక బలగాలను ప్రయోగించడానికి అమెరికా సిద్ధంగా వుందని అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించారు. కానీ మరోపక్క ఒకే చైనా విధానానికి అమెరికా ఇంకా కట్టుబడే వుందని స్పష్టం చేశారు. తైవాన్ స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించడం లేదన్నారు. ఆదివారం రాత్రి ప్రసారమైన సిబిఎస్ న్యూస్ '60 మినిట్స్' ఇంటర్వ్యూలో, చైనా, తైవాన్‌ల మధ్య ఘర్షణ చెలరేగినపుడు తైవాన్‌కు అమెరికా బాసటగా నిలుస్తుందా అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ప్రశ్నించగా, బైడెన్ పై రీతిన సమాధానమిచ్చారు.
అనూహ్యమైన దాడి జరిగినపుడు తప్పకుండా బాసటగా నిలబడతామని బైడెన్ సమాధానమిచ్చారు. అయితే చైనా పట్ల అమెరికా విధానం ఏమీ మారలేదంటూ ఇంటర్వ్యూ ప్రసారం కావడానికి ముందుగానే వైట్‌హౌస్ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. అంటే తైవాన్ను సమర్ధిస్తుందా లేదా అన్నదాంట్లో ఏ ఒక్కదాన్నీ అమెరికా ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి స్కాట్ పెల్లే మరోసారి దీనిపై ప్రశ్నించారు. ఉక్రెయిన్ మాదిరిగా కాకుండా, తైవాన్ విషయంలో చైనా దాడి చేస్తే అమెరికా బలగాలు తైవాన్ను కాపాడతాయా అని ప్రశ్నించగా, అవుననే బైడెన్ పునరుద్ఘాటించారు.
''ఒకే చైనా విధానాన్ని వాషింగ్టన్ గౌరవిస్తుంది. చాలా కాలం క్రితం మేం దేనిపైన సంతకం చేశామో దానికే కట్టుబడి వున్నాం. అయితే తైవాన్ తన స్వాతంత్య్రం గురించి తన స్వంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ వారు స్వాతంత్య్రులు కావాలని మనం ప్రోత్సహించరాదు. అదీ ఆ నిర్ణయం.'' అని బైడెన్ స్పష్టం చేశారు.
అమెరికా విధానాన్ని
తీవ్రంగా ఉల్లంఘించడమే : చైనా
బైడెన్ ఆదివారం ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఒకే చైనా అన్న అమెరికా విధానాన్ని తీవ్రంగా ఉల్లం ఘించడమేనని చైనా స్పష్టం చేసింది. తైవాన్ వేర్పాటువాద బగాలకు ఇదొక తప్పుడు సంకేతాలను పంపిస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ పత్రికా సమావేశంలో చెప్పా రు. శాంతియుత విలీన అవకాశాలకు చిత్తశుద్ధితో తాము కృషి చేస్తున్నామని మావో చెప్పారు. దేశాన్ని చీల్చే ఎలాంటి చర్యలను తాము సహించబోమని స్పష్టం చేశారు. అవసరమైన అన్ని చర్యలను తీసుకున హక్కును అట్టిపెట్టుకుంటామన్నారు.