Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా : టర్కీ ఓడరేవులో సరుకులను దించుతుండగా భారీ నౌక ఒకటి సముద్ర జలాల్లో మునిగిపోయింది. అయితే సిబ్బంది అందరూ సురక్షితంగానే తప్పించుకోగలిగారని అధికారులు తెలిపారు. సీ ఈగిల్ అనే పేరు గల ఈ భారీ నౌక ఈజిప్ట్‌కి చెందిన సరుకుల రవాణా నౌక. గత శనివారం ఈ నౌక నుండి సరుకులను దించుతుండగా, ఒక్కసారిగా తిరగబడడంతో అందులోని అనేక కంటెయినర్లు నీళ్ళలోకి పడిపోయాయి. సీ ఈగిల్ సముద్రంలోకి ఒరిగిపోతూ నెమ్మదిగా మునిగిపోతున్న క్షణాలను బంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. టర్కీలోని ఇస్కెండరమ్ పోర్టులో ఈ నౌక నుండి కంటెయినర్లను అన్లోడ్ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుందని షిప్పింగ్‌కి సంబంధించిన వార్తలను ఇచ్చే ట్రేడ్ విండ్స్ అనే వెబ్సైట్ పేర్కొంది. 1984లో ఈ నౌకను రూపొందించారు. ఓడరేవులోని నౌకనుండి ఒక ట్రక్ సరుకు దించుతుండగా, నెమ్మదిగా ఓడ ఒకవైపునకు ఒరిగిపోతుండడం చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. వెంటనే మోగిన అలారంతో ఆ ఓడకు సమీపంలో వున్న వారందరూ పరుగు పెట్టి సురక్షిత ప్రాంతానికి రావడం ఆ వీడియోలో కనిపిస్తోంది. చాలా త్వరగానే ఆ ఓడ నీళ్ళలో మునిగిపోవడం చూసి సిబ్బంది, అక్కడున్న ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. అయితే ఈ సంఘటన వల్ల 24 కంటెయినర్లలోని సరుకు నష్టపోయామని, స్వల్పంగాచమురు లీకేజీని కూడా కనుగొన్నామని టర్కీ రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది. పైగా ఓడ బ్యాలెన్స్‌కి సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రమాద కారణంపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.