Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు ఉక్రెయిన్ వేర్పాటువాద ప్రాంతాల్లో ఓటింగ్
కీవ్ : తమ ప్రాంతాలు రష్యాలో చేరేందుకు ఓటింగ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు ఉక్రెయిన్లోని రష్యా నియంత్రణలో గల నాలుగు ప్రాంతాల వేర్పాటువాద నేతలు మంగళవారం తెలిపారు. ఈ వారం చివరిలోగా దీనిపై ఓటింగ్ నిర్వహించాలనుకుంటున్నారు. ఆ నాలుగు ప్రాంతాలు డాంటెస్క్, ఖెర్సాన్, లుహాన్స్క్, జపోరిజిజియా. ఈ మేరకు రెఫరెండం నిర్వహించడం అవసరమని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొనడంతో శుక్రవారం నుండి రెఫరెండాలు ప్రారంభమవుతాయని ప్రకటన వెలువడింది. తూర్పు ఉక్రెయిన్లోని లుహాన్స్క్, డాంటెస్క్ ప్రాంతాలను రష్యాలోకి కలిపేయడం వల్ల సరిహద్దులు తిరిగి నిర్వచించడానికి వీలు వుంటుందని, తమని తాము రక్షించుకోవడానికి రష్యాకు వెసులుబాటు వుంటుందని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదెవ్ వ్యాఖ్యానించారు. ఇటువంటి ఓటింగ్ల ఫలితాలు రష్యా అనుకున్న దారిలోనే వుంటాయి. కానీ వీటిని పశ్చిమ దేశాల ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం లేదు. డాంటెస్క్ ప్రాంత అధినేత డెనిస్ పుషిలిన్ మాట్లాడుతూ, రష్యానే తమ మాతృభూమి అని భావించే డాన్బాస్ ప్రజలు ఆ హక్కును సాధించగలిగారని అన్నారు. చారిత్రక న్యాయం పునరుద్ధరించడానికి ఈ ఓటింగ్ దోహదపడుతుందని, రష్యా ప్రజలు దానికోసమే ఎదురుచూస్తున్నారని అన్నారు.